అళగిరికి ఉద్వాసన
డీఎంకే నుంచి బహిష్కరించినకరుణానిధి
కోర్టుకు వెళతానని అళగిరి ప్రకటన
సస్పెండ్ అయిన ఎంపీ, పార్టీ అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె.అళగిరిని డీఎంకే బహిష్కరించింది. అళగిరికి శాశ్వతంగా ఉద్వాసన పలుకుతున్నట్టు పార్టీ అధ్యక్షుడు కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్బళగన్ మంగళవారం ప్రకటించారు. పార్టీ వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడటం.. క్రమశిక్షణను ఉల్లంఘించడం వంటి కారణాలతో పార్టీ దక్షిణాది జిల్లాల కార్యదర్శిగా ఉన్న అళగిరిని కొద్దిరోజులక్రితం తాత్కాలికంగా సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాక ఎన్నికల్లో టికెట్ సైతం నిరాకరించారు. దీంతో స్వరం పెంచిన అళగిరి డీఎంకేకు వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించారు.
కోట్లు దండుకుని అభ్యర్థులకు సీట్లు ఇచ్చారని ఆరోపించడమే కాక పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానని సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో తమకు మద్దతివ్వాలని కోరుతూ బీజేపీ, ఎండీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులు మదురైలోని అళగిరి ఇంటి ముందు క్యూ కట్టారు. దీంతో తన మద్దతుదారులతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ ఆయా పార్టీల అభ్యర్థులకు అళగిరి హామీలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అళగిరి చర్యల్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారంమీడియాకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై వివరణ ఇవ్వనందునే అళగిరిపై చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇందుకు సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. కరుణానిధి బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నేపథ్యంలో క్రమశిక్షణపై పార్టీ శ్రేణులకు హెచ్చరిక ఇచ్చేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
బహిష్కరణపై కోర్టుకు వెళతా: అళగిరి
తనను డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో అళగిరి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను బహిష్కరించినంత మాత్రాన తాను, తన మద్దతుదారులు పార్టీని వీడేది లేదని, దీనిపై కోర్టుకు వెళ్లనున్నట్టు మంగళవారం మదురైలో ప్రకటించారు. పార్టీ తనను ఎలాంటి వివరణ కోరలేదని, ఆయా పార్టీల నాయకులు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తుంటే అందులో తన తప్పేముందని ప్రశ్నించారు.