సాక్షి, చెన్నై: పార్టీ నుంచి ఎంకే అళగిరిని ఇటీవల డీఎంకే అధిష్టానం తాత్కాలికంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బయటకు వచ్చాక అళగిరి తన స్వరాన్ని పెంచుతూ వస్తున్నారు. మద్దతుదారులతో మంతనాల్లో బిజీబిజీగా ఉన్నారు. డీఎంకేను చీల్చే వ్యూహం తో దూసుకెళుతున్న అళగిరి రెండు రోజుల క్రితం మదురై వేదికగా జరిగిన మద్దతుదారుల మంతనాల అనంతరం తాను పార్టీ పెట్టబోనంటూ ప్రకటించారు.
డీఎంకేను రక్షించుకోవడం, కరుణానిధికి అండగా నిలబడటం తన కర్తవ్యంగా ప్రకటించారు. కొందరి చెప్పు చేతుల్లోకి డీఎంకే వెళ్లిందని, వారి నుంచి పార్టీని రక్షించుకుందామని అళగిరి ఇచ్చిన పిలుపు డీఎంకే వర్గాల్ని ఆలోచనలో పడేసింది. పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌కు వ్యతిరేకంగా అళగిరి దుందుడుకు చర్యలు ఉండటం, లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు రాక పోవడంతో అసంతృప్తితో ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే విధంగా అళగిరి వ్యాఖ్యలు ఉండడంతో డీఎంకే అధిష్టానం మేల్కొంది.
అదే సమయంలో డీఎంకే నుంచి ఆహ్వానం వస్తే, వెళ్లేందుకు తాను సిద్ధమంటూ పరోక్ష సంకేతాన్ని అళగిరి ఇవ్వడానికి పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీలో గందరగోళ పరిస్థితిని సృష్టించడం లక్ష్యంగా దక్షిణాది కింగ్ మేకర్ అళగిరి చక్రం తిప్పుతున్నట్టు అధిష్టానం గుర్తించింది. దీంతో కింగ్ మేకర్‌కు షాక్ ఇచ్చేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా అధినేత కరుణానిధి హెచ్చరికలు జారీ చేశారు.
జర భద్రం: బుధవారం డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఆదేశాల మేరకు అన్నా అరివాళయం వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. అందులో అళగిరిని టార్గెట్ చేసి విరుచుకు పడ్డారు. పార్టీలో గందరగోళం సృష్టించడం లక్ష్యంగా, పార్టీ వర్గాల్ని పక్కదారి పట్టించే రీతి లో అళగిరి చర్యలు ఉన్నాయని వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతోనే అళగిరిని తాత్కాలికంగా బహిష్కరించామని గుర్తు చేశారు.
అయితే, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతోపాటుగా, పార్టీలో గందరగోళం సృష్టించే లక్ష్యంగా ఆయన ముందుకెళుతున్నట్టు పేర్కొన్నారు. పార్టీతో అళగిరికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మంతనాలు, సమావేశాల పేరుతో పార్టీ నాయకులను, కార్యకర్తలను అళగిరి కలుస్తూ వస్తున్నట్టుగా అధిష్టానం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అళగిరి చర్యలు పార్టీకి నష్టం తెప్పించే అవకాశాలు ఉన్నాయని, దీన్ని గుర్తెరిగి ప్రతి నాయకుడు, కార్యకర్త వ్యవహరించాలని సూచించారు.
మరో మారు స్పష్టం చేస్తున్నామని అళగిరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన పిలుపు మేరకు సమావేశాలు, సభలకు పార్టీ వర్గాలెవ్వరు వెళ్లడానికి వీలు లేదని హెచ్చరించారు. ఒక వేళ ఎవరైనా వెళ్లినట్టు తేలిన పక్షంలో క్రమ శిక్షణ చర్యలు తప్పదని, వారెంతటి వారైనా సరే ఉపేక్షించబోమన్నారు. అరుుతే అధిష్టానం హెచ్చరికతో అళగిరి స్పందిస్తూ, తాను డీఎంకే వ్యతిరేకిని కాను అని స్పష్టం చేశారు.
అళగిరి తో జర భద్రం!
Published Thu, Mar 20 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM
Advertisement