విడవలూరు,న్యూస్‌లైన్: ఈ నెల 7న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని టీడీపీ అడ్డదారులు తొక్కుతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ కోవూరు అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి బంధువు పోతిరెడ్డి సుబ్బారెడ్డి నివాసంలో భారీ మద్యాన్ని నిల్వ ఉంచారు. ఈ విషయం తెలిసి ఎక్సైజ్‌శాఖ అధికారులు శనివారం దాడి చేసి సుమారు 1902 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పోతిరెడ్డి సుబ్బారెడ్డి ఇంట్లో భారీగా మద్యం ఉన్నట్టు సమాచారం అందిందన్నారు.
సిబ్బందితో కలిసి దాడి చేయగా సుబ్బారెడ్డి ఇంట్లో 30 బస్తాల్లో 1773 బాటిళ్ల(హనిబీ)ను, సమీపంలో కందుకూరి రవికుమార్ ఇంటి ఆవరణలోని బాత్‌రూంలో నాలుగు బస్తాల్లో సుమారు 129 బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. సుబ్బారెడ్డి, రవికుమార్‌లను అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు.
ఓటర్లకు మద్యంతో ఎర వేసేందుకే..
విడవలూరు మండలంలో వైఎస్సార్‌సీపీ గాలి బలంగా వీస్తుండటంతో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఓట్లు రాబట్టుకునేందుకు దొడ్డిదారిని ఎంచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే తన సోదరి మాతూరు జయలక్ష్మి ఆడపడచు భర్త (పోలంరెడ్డికి అన్న వరుస) నివాసంలో భారీగా మద్యాన్ని నిల్వ ఉంచారని ఆరోపణలున్నాయి.
అంతేకాక సుబ్బారెడ్డి కుమారుడు వేణుగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వెల్డింగ్ షాపులో విధులు నిర్వహిస్తున్నాడు. నియోజకవర్గ పరిధిలో ఇంత భారీ మొత్తంలో మద్యం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ దాడిలో ఎక్సైజ్ శాఖ అధికారులు రవికుమార్, సుధాకర్‌రెడ్డి, ఎన్ వసంతరావు, సూర్యానారాయణ, కిషోర్,కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పోలంరెడ్డి బంధువు ఇంట్లో భారీగా మద్యం
Published Sun, May 4 2014 3:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement