ఎక్స్‌టెన్షన్
Published Wed, Apr 2 2014 3:56 AM | Last Updated on Tue, Aug 14 2018 5:06 PM
సాక్షి, రాజమండ్రి :పుర సమరంలో ఓటరు ఇచ్చిన తీర్పుతో బరువెక్కిన ఈవీఎంలు మరి కొంతకాలం ఆ భారం మోయక తప్పదు! మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం బుధ వారం చేపట్టాల్సిన ఓట్ల లెక్కింపును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల తొమ్మిదిన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించాలని, పూర్తి ఎన్నికల తతంగమంతా పదో తేదీతో ముగించాలని మంగళవారం ఆదేశించింది. దీంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అంతా సిద్ధం చేసేశారు
రాజమండ్రి నగరపాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు మంగళవారం మధ్యాహ్నం వరకూ అధికారులు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. ఈవీఎంలు భద్రపరిచినచోటే కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో ఉదయం నుంచీ నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో కోర్డు ఆదేశాలతో లెక్కింపు వాయిదా పడడంతో ఏర్పాట్లు నిలుపు చేశారు. కాగా మరో వారం పాటు ఈవీఎంలను పరిరక్షించే బాధ్యత పోలీసులపై పడింది. దీంతో స్ట్రాంగ్ రూముల వద్ద బందోబస్తు మరింత కట్టుదిట్టం చేశారు.
వీడని ఉత్కంఠ
మరో 24 గంటల్లో ఫలితాలు వెలువడతాయనగా ఓట్ల లెక్కింపు వాయిదాపడడం అభ్యర్థుల్లో ఉత్కంఠను పెంచింది. ఫలితం ఎలా ఉండబోతోందనే ఆసక్తితో ఉన్న ప్రజలు కూడా ‘ఈ నిరీక్షణ ఇంకానా!’ అంటూ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పట్టణాల్లో ఏ పదిమందిని చూసినా ఫలితాలపైనే చర్చ సాగుతోంది. గెలుపు ఓటములపై రూ.లక్షల్లో పందేలు కూడా సాగుతున్నాయి. అభ్యర్థులు కూడా రకరకాలుగా లెక్కలు వేసుకొని ఎవరికి వారే తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఎప్పుడు అధికార పీఠం అధిష్టిద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో లెక్కింపు వాయిదా అన్ని వర్గాల్లో టెన్షన్‌ను మరింతగా పెంచేసింది.
ఈవీఎంలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి
రాజమండ్రి కార్పొరేషన్ ఈవీఎంలను స్థానిక ఎస్‌కేవీటీ కళాశాలలో భద్రపరిచారు. అమలాపురం వెచ్చావారి అగ్రహారం వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో, తుని బ్యాంకు కాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలు ఉంచారు. సామర్లకోట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామచంద్రపురంలోని చింతపల్లి సూరన్ననగర్‌లోని ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూలు, పిఠాపురం మెయిన్ రోడ్డులోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, మండపేట కలువపువ్వు సెంటర్‌లోని మున్సిపల్ కార్యాలయం, పెద్దాపురం లూధరన్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు ఉంచారు. గొల్లప్రోలు నగర పంచాయతీలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం, ముమ్మిడివరంలోని ఏఐఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు.
Advertisement
Advertisement