పురపాలకులెవరో తేలేది నేడే
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రిలో 50; జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో 264 కలిపి మొత్తం 314 డివిజన్‌లు ఉండగా మున్సిపాలిటీల్లో తొమ్మిది డివిజన్లకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. 305 డివిజన్‌లలో జరిగిన ఎన్నికల బరిలో 1082 మంది అభ్యర్థులు నిలిచారు. 5,39,723 మంది ఓటర్లకు గాను 4,00,558 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా 305 మంది వార్డు సభ్యుల ఎన్నిక కోసం తమ తీర్పును ఈవీఎంలలో పదిలపరిచారు. తమ భవితవ్యం ఏమవుతుందో అన్న ఉత్కంఠతో అభ్యర్థులు నేడు కౌంటింగ్ కేంద్రాలకు హాజరవుతున్నారు.
తొలి ఫలితాలపై ఉత్కంఠ
మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను వరుసగా ఎదుర్కొన్న పార్టీలు తొలి ఫలితాలు వెలువడుతుండడంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. టీడీపీ వార్డులు గెలుచుకునేందుకు ఎన్నో కుయుక్తులు పన్నింది.
మున్సిపాలిటీల వారీగా వివరాలు
రాజమండ్రి
కార్పొరే షన్‌లో 50 డివిజన్లు ఉన్నాయి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచి డివిజన్‌కు ఒకరు చొప్పున, కాంగ్రెస్ పార్టీ నుంచి 19 డివిజన్లలోను పోటీలో నిలిచారు. ఇతర పార్టీల నుంచి 46 మంది, ఇండిపెండెంట్లు 113 మంది పోటీలో ఉన్నారు. 2.43 లక్షల మంది ఓటర్లకు గాను 1.68 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఎస్‌కేవీటీ డిగ్రీ కళాశాలలో 30 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపడుతున్నారు.
అమలాపురం
30 వార్డులకుగాను నాలుగు ఏకగ్రీవం అవగా 26 వార్డులకు 80 మంది పోటీపడ్డారు. వీరిలో కాంగ్రెస్ ఏడుగురు, వైఎస్సార్ కాంగ్రెస్ 21 మంది, టీడీపీ 26 మంది, ఇతరులు 13 మంది, ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. 32, 250 మంది ఓటర్లకుగాను 24,941 మంది ఓటు వేశారు. వెచ్చావారి అగ్రహారం వద్ద ఉన్న జూనియర్ కళాశాలలో పది టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
తుని
30 వార్డులకు గాను 105 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల తరఫున వార్డుకు ఒక్కొక్కరు చొప్పున, ఇతర పార్టీలకు చెందిన నలుగురు, 11 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల్లో తలపడ్డారు. 36,137కి 27,120 మంది ఓటువేశారు.
సామర్లకోట
మున్సిపాలిటీలోని 30 వార్డులకు 82 మంది పోటీచేశారు. వైఎస్సార్‌సీపీ నుంచి 30 మంది, టీడీపీ అభ్యర్థులు 29 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్ ఒక్కరిని కూడా పోటీకి పెట్టలేకపోయింది. 16 మంది ఇండిపెండెంట్లు, ఏడుగురు ఇతర పార్టీలకు చెందినవారు బరిలో ఉన్నారు. 35,959కి 27,038 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. గవర్నమెంటు జూనియర్ కళాశాలలో ఏడు టేబుల్స్ వేసి కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
రామచంద్రపురం
27 వార్డుల్లో 79 మంది పోటీపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ 27, టీడీపీ 27, కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్లు 16 మంది పోటీలో ఉన్నారు. 31,186 మంది ఓటర్లకుగాను 25,550 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూలులో ఎనిమిది టేబుల్స్‌తో కౌంటింగ్ చేపడుతున్నారు.
పిఠాపురం
పిఠాపురం మున్సిపాలిటీలో 30 వార్డులకుగాను 117 మంది పోటీపడుతున్నారు. 12 మంది కాంగ్రెస్, 29 మంది వైఎస్సార్ కాంగ్రెస్, 30 మంది టీడీపీ, ఏడుగురు ఇతర పార్టీలు, 39 మంది ఇండిపెండెంట్లు పోటీచేస్తున్నారు. 37,086 మంది ఓటర్లకుగాను 28,700 మంది ఓటు వేశారు. ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.గవర్నమెంటు జూనియర్ కాలేజీలో ఆరు టేబుల్స్ ఏర్పాటుచేసి కౌంటింగ్ చేపడుతున్నారు.
మండపేట
29 వార్డులకు ఒకటి ఏకగ్రీవం కాగా మిగిలిన వార్డుల్లో 88 మంది పోటీలో ఉన్నారు. ఇండిపెండెంట్లు 15 మంది, ఇతర పార్టీలు మూడు, టీడీపీ 28, వైఎస్సార్ కాంగ్రెస్ 28, కాంగ్రెస్ తరఫున 14 మంది బరిలో ఉన్నారు. 38,261 మంది ఓటర్లకుగాను 32,854 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీసులో ఏడు టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ చేపడతారు.
పెద్దాపురం
పెద్దాపురంలో 28 వార్డుల్లో 74 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 26 మంది వైఎస్సార్ కాంగ్రెస్, 27 టీడీపీ, ముగ్గురు కాంగ్రెస్, ఏడుగురు ఇతర పార్టీలు, 11 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. 34,822కి 25,161 మంది ఓటువేశారు. లూథరన్ హైస్కూలులో ఏడు టేబుల్స్ ఏర్పాటుచేసి కౌంటింగ్‌కు రంగం సిద్ధం చేశారు.
గొల్లప్రోలు
20 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవం అయింది. 19 వార్డులకు 48 మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ 19, టీడీపీ 19, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు ఐదుగురి భవితవ్యం నేడు తేలనుంది. 17,544కి 14,435 మంది ఓట్లు వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఐదు టేబుల్స్ ఏర్పాటుచేసి కౌంటింగ్ నిర్వహిస్తారు.
ముమ్మిడివరం
20 వార్డుల్లో మూడు ఏకగ్రీవంకాగా 17 వార్డులకు 53 మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ 14, టీడీపీ 17, కాంగ్రెస్ మూడు, ఇండిపెండెంట్లు 19 మంది బరిలో నిలిచారు. 15,586కి 12,672 మంది ఓట్లు వేశారు. ఎ.ఐ.ఎం.ఎస్. ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగు టేబుల్స్‌పై లెక్కింపు చేపడుతున్నారు.
ఏలేశ్వరం
20 వార్డుల్లో 78 మంది బరిలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ 20, టీడీపీ 20, కాంగ్రెస్ 17, ఇతర పార్టీలు ఒకటి, ఇండిపెండెంట్లు 20 మంది భవితవ్యం నేడు తేలనుంది. 18,000 మందికి గాను 14,472 మంది ఓట్లు వేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఆరు టేబుల్స్ ఏర్పాటు చేసి లెక్కింపు చేపడుతున్నారు.