పురఫలితం నేడే!
సాక్షి, గుంటూరు :పుర ఫలితాలపై నెలన్నర రోజుల నిరీక్షణకు నేటితో తెరపడనుంది. అభ్యర్థులు, బెట్టింగ్ రాయుళ్లలో ఉత్కంఠ వీడనుంది. జిల్లాలో 12 మున్సిపాలిటీల పరిధిలోని 371 వార్డుల్లో పోటీచేసిన 1463 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. సోమవారం ఉదయం 11 గంటల కల్లా పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. జిల్లాలో మార్చి 30వ తేదీ పురపాలక ఎన్నికల పోలింగ్ నిర్వహించగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు వాయిదాపడిన విషయం తెలిసిందే. 12 మున్సిపాలిటీల్లో 634 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించగా ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వాటిని రౌండ్ల వారీగా లెక్కించి సోమవారం ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం 8 గంటలకే ప్రారంభం..
నరసరావుపేట శివారులోని ఏఎంరెడ్డి కళాశాలలో ఐదు మున్సిపాలిటీల లెక్కింపు, తెనాలి పట్టణంలోని జేఎమ్‌జే కళాశాలలో నాలుగు మున్సిపాలిటీల, గుంటూరు టీజేపీఎస్ కళాశాలలో మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన లెక్కింపు చేపట్టనున్నారు. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రంలో 12 టేబుళ్లు, తెనాలి కౌంటింగ్ కేంద్రంలో 14, గుంటూరులో 6 టేబుళ్ల ద్వారా లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా పట్టణాలలోని లాడ్జీలు, గెస్ట్‌హౌస్‌లు వివిధ పార్టీల ఏజెంట్‌లు, నాయకులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభయ్యే ఓట్ల లెక్కింపు 11 గంటలకల్లా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
భారీగా బెట్టింగ్‌లు..
ఏ మున్సిపాలిటీ ఎవరికి దక్కుతుంది.. ఏ వార్డులో ఎవరు గెలుస్తారు.. ఎంత మెజార్టీ వస్తుంది అనే అంశాలపై ఇప్పటికే భారీగా బెట్టింగ్‌లు నిర్వహించారు. ఇప్పటికీ ఇంకేమైనా పందెం ఉందా అంటూ ఫోన్లు చేసి మరీ పందెగాళ్లు సవాల్ విసురుతున్నారు. కొన్ని మున్సిపాల్టీలపై ఒకటికి రెండు రెట్లు ఇస్తామనడంతో ఆశకు పోయి అనేకమంది పందేలు కాసినట్లు సమాచారం. గుంటూరు, నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని లాడ్జిల్లో మకాంవేసి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ ఫలితాల కోసం వీరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఆరు నుంచి తొమ్మిది రౌండ్లలో లెక్కసరి..
జిల్లాలో మూడు కేంద్రాల్లో జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఆరు నుంచి తొమ్మిది రౌండ్లలో పూర్తవుతుందని మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. ఎన్నికల్లో అబ్జర్వర్లుగా వ్యవహరించిన లక్ష్మీనరసింహం, అనితారాజేందర్‌లు కౌంటింగ్‌కు కూడా అబ్జర్వర్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారు. వీరు కాకుండా ఒక్కో మున్సిపాలిటీకి అదనంగా మరొకరిని నియమించామన్నారు. సోమవారం కౌంటింగ్ ప్రక్రియలో 346 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. కౌంటింగ్ హాల్‌లోకి సెల్‌ఫోన్‌లు తీసుకురాకూడదని, ఒకసారి లోపలికి వచ్చిన తరువాత కౌంటింగ్ పూర్తయ్యే వరకూ బయటకు వెళ్లే వీలులేదని ఆయన స్పష్టం చేశారు. గెలుపొందిన వార్డు మెంబర్ అభ్యర్థులకు వెంటనే డిక్లరేషన్ ఫాంలు అందిస్తామన్నారు. అదేవిధంగా 17వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అప్పటి వరకు విజయోత్సవ ర్యాలీలు నిషిద్ధమని చెప్పారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు.