కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్తు
ఏటీ అగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్ :మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ పర్యవేక్షణలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. మూడంచెల విధానంలో పోలింగ్ కేంద్రం లోపల, ఆవరణలో, సమీపంలో పోలీసు ఆంక్షలు విధించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోలీసుయాక్ట్-30 అమలులో ఉంటుంది.
పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లుగా ఫొటో గుర్తింపుకార్డు ఉన్నవారినే అనుమతిస్తారు. వారివెంట సెల్‌ఫోన్లు, కెమేరాలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడాన్ని నిషేధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఊరేగింపులు, బాణ సంచా కాల్చడం లాంటి చర్యలపై నిషేధాజ్ఞలు విధించారు. పోలీసు ఆంక్షలను అతిక్రమించేవారిపై కఠినంగా వ్యవహరించి కేసులునమోదు చేయాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏఎస్పీ, 10 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, వెయ్యిమంది సిబ్బందితోపాటు ఆరు ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నాయి. ఈ ఆంక్షలన్నీ పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా అమలులో ఉంటాయి.
అమలులో 144 సెక్షన్.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న గుంటూరులోని టీజేపీఎస్ కళాశాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్ర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం లోపలికి అనుమతించాలని అర్బన్ ఎస్పీ జెట్టి గోపీనాథ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనలు చోటుచేసుకుండా ఉండేలా అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎస్పీలను ఆదేశించారు. అదనపు ఎస్పీ జానకీధరావత్ నేతృత్వంలో ముగ్గురు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, 22 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 130 మంది కానిస్టేబుళ్లతోపాటు రెండు ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది కౌంటింగ్ విధులను పర్యవేక్షించనున్నారు.
మున్సిపల్, పరిషత్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను ఎక్సైజ్ అధికారులు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మూసివేయించారు. రెండ్రోజుల పాటు మద్యం దుకాణాలన్నీ మూసివేసి ఉంటాయి. తిరిగి బుధవారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి కేటాయించిన సమయాల్లో మద్యం దుకాణాలను తెరవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.కుళ్లాయప్ప ఆదేశాలు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ రెండురోజులు మద్యం విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం విక్రయాలు కొనసాగించేవారిపై ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు.