నాందేడ్: మరాఠ్వాడా ప్రాంతంలో ఏప్రిల్ 17న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇక్కడ నుంచే లోక్‌సభ బరిలో ఉండటం ఉత్కంఠకు దారితీసింది. నాందేడ్ నియోజకవర్గం నుంచి చవాన్ లోక్‌సభకు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కాగా, ఇక్కడ బీజేపీకి చెందిన డీబీ పాటిల్ పోటీచేస్తున్నారు. 17వ తేదీన రాష్ట్రం మొత్తం మీద 23 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి నిలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటన్నింటిలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోని భోకర్ అసెంబ్లీ స్థానం నుంచి చవాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న చవాన్ అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడిన అధిష్టానం చివరకు లోక్‌సభ బరిలో అతడినే దింపేందుకు నిర్ణయించింది. చవాన్ లోక్‌సభకు పోటీచేయడం ఇది మొదటిసారి కాదు. ఆయన 1987లో నాందేడ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 1989లో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అశోక్ చవాన్ తండ్రి ఎస్.బి.చవాన్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. కాగా, బీజేపీ అభ్యర్థి పాటిల్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. నాందేడ్‌లో మోడీ అనుకూల పవనాలు, చవాన్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. మోడీ ప్రభంజనంలో చవాన్ కొట్టుకుపోవడం ఖాయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. పాటిల్ 2004లో ఇక్కడ నుంచి గెలిచి తర్వాత ఎన్సీపీలో చేరారు. అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా, నియోజకవర్గంలో 13 శాతం ఓట్లు ఉన్న ముస్లిం వర్గం నుంచి ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కాగా, ఆదర్శ్ కుంభకోణంలో తన ప్రమేయం ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలను అశోక్ చవాన్ తీవ్రంగా ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే విపక్షాలు ‘ఆదర్శ్’ అంశాన్ని లేవదీస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆదర్శ్ అంశం తెరమీదకు రాగానే నాందేడ్ అభ్యర్థిగా చవాన్‌కు బదులు అతడి భార్య అమీతను నిలబెట్టాలని పార్టీ అధిష్టానం మొదట యోచించింది. అయితే అది పార్టీపైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముందని భావించి తన యోచనను విరమించుకుంది. రాజకీయ నాయకులు, రాష్ట్ర అధికారులు, ఆర్మీ అధికారుల నిమిత్తం దక్షిణ ముంబైలో అప్పట్లో ‘ఆదర్శ్’ బహుళ అంతస్తుల భవనం నిర్మించిన సంగతి తెలిసిందే.
అయితే వాటిలో చాలా ఫ్లాట్‌లను అప్పటి సీఎం అశోక్‌చవాన్, అతడి మంత్రివర్గ సభ్యులు కొందరు అనధికారికంగా బంధువులకు, అస్మదీయులకు కేటాయించారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని కోట్ల రూపాయల విలువచేసే ఈ ఫ్లాట్లలో మూడింటిని అశోక్ చవాన్ తన బంధువులకు అక్రమంగా బదలాయించారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. దీంతో 2010లో అశోక్‌చవాన్ సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చింది.
అనంతరం చవాన్‌తోపాటు అతడి మంత్రివర్గంలోని సభ్యులైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్‌కుమార్ షిండే తదితరులపై జరిగిన న్యాయవిచారణలో సైతం ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఆ నివేదికను పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కుంభకోణంలో అశోక్ చవాన్ పాత్రపై సీబీఐ విచారణకు గవర్నర్ శంకర్‌నారాయణన్ తిరస్కరించడంతో తన ప్రాథమిక చార్జిషీట్‌లో చవాన్ పేరును సీబీఐ చేర్చలేదు.
నాందేడ్ సిట్టింగ్ ఎంపీ, చవాన్ బావమరిది అయిన భాస్కర్‌రావ్ పాటిల్ ఖాట్గోంకర్ ప్రస్తుతం తిరిగి పోటీచేయనని ప్రకటించి పాటిల్‌కు మార్గం సుగమం చేశారు. నాందేడ్ జిల్లాలో చవాన్ కుటుంబానికి ఉన్న పట్టు నేపథ్యంలో మోడీ ప్రభావం ఈ నియోజకవర్గంపై అంతగా ఉండకపోవచ్చని, ప్రస్తుత ఎన్నికల్లో అతడి గెలుపు నల్లేరుమీద నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
‘నాందేడ్’పైనే నజర్!
Published Fri, Apr 11 2014 10:54 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
Advertisement