టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించండి | Assets of the said dipakreddy   Instruct probe | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించండి

Published Sat, Apr 12 2014 2:26 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆస్తులపై  దర్యాప్తునకు ఆదేశించండి - Sakshi

టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశించండి

రూ. 6,781 కోట్ల వివాదాస్పద
 ఆస్తులపై హైకోర్టులో పిటిషన్


 హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా నాయకుడు జి.దీపక్‌రెడ్డి ఆస్తులపై దర్యాప్తునకు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)లను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అదే జిల్లాకు చెందిన మార్పు డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యుడు వి.సుధీర్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఈడీ, సీబీఐ జాయింట్ డెరైక్టర్‌లతో పాటు జి.దీపక్‌రెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 15న విచారణకు రానున్నది. ‘దీపక్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో 2009-10 ఆర్థిక సంవత్సరానికి తన వార్షిక ఆదాయం రూ. 3.27 లక్షలుగా, తన భార్య ఆదాయం రూ. 1.98 లక్షలుగా పేర్కొన్నారు.


వాటాలు, ఇతర చరాస్తులు తన పేరు మీద రూ. 4.59  కోట్లు, తన భార్య పేరున రూ. 1.76 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన పేరున రూ. 5.86 కోట్ల విలువైన స్థిరాస్తులు, తన భార్య పేరున రూ. 16.86 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. అంతేకాక వివాదాల్లో రూ. 6,781.05 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌ను బట్టి చూస్తే దీపక్‌రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ఆస్తుల వివరాలను ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన రిటర్న్స్‌లో వెల్లడించలేదు. కేవలం ఆదాయం రూ. 5 లక్షలుగా మాత్రమే చూపారు. వివాదంలో ఉన్నట్లు చెబుతున్న ఆస్తులన్నీ ప్రస్తుతం దీపక్‌రెడ్డి స్వాధీనంలోనే ఉన్నాయి. వాటినెలా సంపాదించారో తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ, ఈడీల దర్యాప్తుకు ఆదేశాలివ్వండి’ అని పిటిషనర్ తన పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement