
బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: బిజెపి-తెలుగుదేశం పొత్తు వ్యవహారం ఇరు పార్టీలకు ఇబ్బందిగానే ఉంది. పొత్తు ప్రకటన అధికారికంగా వెలువడి తరువాత రెండు పార్టీలకు చెందిన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు తీవ్రస్థాయిలో బహిరంగంగానే విమర్శిస్తుంటే, కొందరు తిరుగుబాటు చేస్తున్నారు. మరికొందరు ఏకంగా రెండు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు.
ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన సంకినేని వెంకటేశ్వర్లుకు సూర్యాపేట శాసనసభ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన అనుచరులు డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కొందరు కార్యకర్తలు అక్కడే ఆత్మహత్యయత్నం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంకినేని వెంకటేశ్వరరావు 2004లో నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదరరెడ్డిపై టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత డీలిమిటేషన్తో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయింది. దాంతో ఆయన కన్ను సూర్యాపేటపై పడింది. 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సూర్యాపేట స్థానం టిఆర్ఎస్కు కేటాయించారు. అప్పటికే సూర్యాపేట నుంచి పోటీ చేయడానికి బి ఫారం తీసుకున్న సంకినేని దానిని చంద్రబాబుకు వెనక్కి ఇచ్చేశారు. ఆ తరువాత నియోజకవర్గం నేతలతో విభేదాలు ఎదురవడంతో 2012లో టిడిపికి రాజీనామా చేశారు. వైఎస్ఆర్సిపిలో చేరారు. ఆ పార్టీలో కూడా ఎక్కువ కాలం ఉండలేదు.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో బిజెపిలో చేరారు. బిజెపిలో అయితే సూర్యాపేట టిక్కెట్ తప్పక లభిస్తుందని భావించారు. దానిపై ఎన్నోల ఆశలు పెట్టుకున్నారు. బిజెపి-టిడిపి పొత్తుతో కథ అడ్డం తిరిగింది. సూర్యాపేట టిడిపికి కేటాయించారు. ఇప్పుడు ఆయనకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.