చంద్రబాబు చంద్రబాబే!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బిజెపి పట్ల తన కుయుక్తులు మరోసారి ప్రదర్శించారు. పొత్తు ధర్మం తప్పారు. కమలనాథులకు షాక్ ఇచ్చారు. ముందు కేటాయించిన ఒక శాసనసభ స్థానం వదులుకొని బిజెపి ఎంత సామరస్యంగా వ్యవహరించినప్పటికీ చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు. బిజెపికి కేటాయించిన స్థానాల్లో పోటీకి దిగిన ఇద్దరు టిడిపి అభ్యర్థులకు చంద్రబాబు పార్టీ బిఫారాలు ఇచ్చారు. టిడిపి నేతలకు దిమ్మతిరిగిపోయింది.
టిడిపి-బిజెపి పొత్తులో భాగంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లా కడప శాసనసభ స్థానాలను బిజెపికి కేటాయించారు. బిజెపి సంతనూతలపాడు స్థానం దారా సాంబయ్యకు, కడప స్థానం కె.హరినాథ్‌రెడ్డికి కేటాయించింది. ఆ రెండు స్థానాల్లో టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారికి టిడిపి బిఫారాలు కూడా ఇచ్చేశారు. చంద్రబాబు వైఖరిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపితో పొత్తు వద్దని స్థానిక నేతలు చెబుతున్నప్పటికీ బిజెపి అధిష్టానం వారి మాటలను పెడచెవిన పెట్టింది. నామినేషన్లు వేసే సమయంలో పొత్తు బెడిసి కొట్టింది. బిజెపితో పొత్తులేదని నిన్న, మొన్న టిడిపి నేతలు ప్రచారం చేశారు. నిన్న రాత్రి మళ్లీ ఇరు పార్టీ నేతల మధ్య చర్చలు జరిగాయి. ఇచ్ఛాపురం శాసనసభ స్థానంను బిజెపి వదులుకొని టిడిపికి కేటాయించింది. బిజెపి 4 లోక్సభ, 13 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. నరసరావుపేట, కోడుమూరులలో అభ్యర్థులను మార్చడానికి కూడా బిజెపి అంగీకరించింది. మళ్లీ పొత్తు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. తెల్లారిన తరువాత మళ్లీ కథ మొదలు. చంద్రబాబు తన నైజం చూపారు. బిజెపి అంత దిగి వచ్చినా ఆయన తన శైలి మార్చుకోలేదు. చంద్రబాబు చంద్రబాబే అనిపించుకున్నారు.