పాలకొల్లు ఓటర్లను తికమక పెట్టిన ‘ఆటో’ | Auto symbol confused palakollu voters in westgodavari district | Sakshi
Sakshi News home page

పాలకొల్లు ఓటర్లను తికమక పెట్టిన ‘ఆటో’

Published Sun, May 18 2014 12:57 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

పాలకొల్లు ఓటర్లను తికమక పెట్టిన ‘ఆటో’ - Sakshi

పాలకొల్లు ఓటర్లను తికమక పెట్టిన ‘ఆటో’

పాలకొల్లు: సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటరీలో స్వతంత్ర అభ్యర్థికి, పాలకొల్లు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ఆటో గుర్తు కేటాయించడంతో క్షీరపురి ఓటర్లు తికమకపడ్డారు. దీంతో పాలకొల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ రెబెల్‌గా పోటీచేసిన డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి)కి పడాల్సిన ఓట్లు నరసాపురం ఎంపీగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి గీతా దాస్‌దాస్‌కు పడ్డాయనే అంశం స్థానికంగా చర్చనీయాంశమైంది.

పాలకొల్లులో టీడీపీ రెబల్‌గా పోటీ చేసిన డాక్టర్ బాబ్జికి ఎన్నికల సంఘం ఆటో  గుర్తును కేటాయించింది. ఆటో గుర్తుకు ఓటు వేయాలంటూ ఆయన వర్గీయులు, కార్యకర్తలు నియోజకవర్గమంతా విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీలకతీతంగా బాబ్జికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఇదే సమయంలో నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గీతా దాస్ దాస్‌కు కూడా ఎన్నికల సంఘం ఆటో గుర్తును కేటాయించింది.

మే 7న జరిగిన పోలింగ్‌లో ముందుగా నరసాపురం పార్లమెంట్‌కు పోటీ చేసిన గీతా దాస్‌దాస్ ఎన్నికల గుర్తు ఆటో ఉండడంతో బాబ్జి గుర్తు అనుకుని ఎక్కువమంది  ఓట్లు వేశారు. పాలకొల్లు నియోజకవర్గంలో అందరికీ సుపరచితుడైన నరసాపురం సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుమూరి బాపిరాజుకు కేవలం 3,766 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థి, ఎవరికీ పరిచయం కూడా లేని గీతా దాస్‌దాస్‌కు పాలకొల్లులో ఏకంగా 12,029 ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే బాబ్జికి పడాల్సిన ఓట్లని తెలుస్తోంది.

గీతా దాస్‌దాస్‌కు నరసాపురం ఎంపీ నియోజకవర్గంలో మొత్తం 23,585 ఓట్లు రాగా, పాలకొల్లు పక్క నియోజకవర్గాలైన ఆచంటలో 907 ఓట్లు, నరసాపురంలో 800 ఓట్లు మాత్రమే వచ్చాయి. గీతా దాస్‌దాస్‌కు పోలైన ఓట్లు అత్యధికం డాక్టర్ బాబ్జికి పడాల్సినవేనని, ఆయనకు వచ్చిన 38,420 ఓట్లకు, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఆటో గుర్తుకు పోలైన 12,000 కలుపుకుంటే 50 వేలకు పైగా ఓట్లు వచ్చి ఉండేవని, కనీసం రెండో స్థానంలో నిలిచేవారని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement