గుర్గావ్‌లో యాదవుల యుద్ధం | Battle of Yadavas in Gurgaon | Sakshi
Sakshi News home page

గుర్గావ్‌లో యాదవుల యుద్ధం

Published Thu, Mar 20 2014 10:33 PM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

Battle of Yadavas in Gurgaon

గుర్గావ్: ఢిల్లీకి దక్షిణాన కొలువైన గుర్గావ్‌ను పేద, ధనికవర్గాల ప్రజలతోపాటు పట్టణ, పల్లెలున్న ప్రాంతంగా చెప్పుకుంటారు. కార్పొరేట్ టవర్లు, రెసిడెన్షియల్ టవర్లేకాదు పర్ణకుటీరాల్లాంటి గుడిసెలు కనిపించే పల్లెలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.
 
  హర్యానా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో చెప్పుకునే గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారందరూ యాదవులే కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో యాదవుల జనాభా గెలుపోటములను శాసించే స్థాయిలో లేకపోయినా దాదాపు పోటీలో ఉన్న మూడు పార్టీలు యాదవ అభ్యర్థులనే రంగంలోకి దించాయి. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రావ్ ధర్మపాల్‌యాదవ్ ఈసారి ఇక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు.
 
  రేవారి నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై, ప్రస్తుతం భూపిందర్‌సింగ్ హూడా కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తున్న అజయ్‌సింగ్ యాదవ్ ఈసారి గుర్గావ్ లోక్‌సభ సీటును తన తనయుడు చిరంజీవ్ రావ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న రెండో యాదవ అభ్యర్థి చిరంజీవ్‌రావ్ యాదవ్ అవుతారు.
 
  ఇక సిట్టింగ్  ఎంపీ ఇంద్రజీత్ సింగ్(ఈయన కూడా యాదవుల సామాజికవర్గానికి చెందినవారే) ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ గుర్గావ్ టికెట్‌ను ఈయనే ఇస్తామని హామీ ఇవ్వడంతో దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఇంద్రజీత్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
 
  దీంతో బీజేపీ తరఫున బరిలోకి దిగుతున్న యాదవ అభ్యర్థి ఇంద్రజీత్ కానున్నారు. ఇక కొత్త సంచలనం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యూహాత్మకంగా యాదవ అభ్యర్థినే బరిలోకి దించింది. ఆ పార్టీలో కీలకసభ్యుడిగా వ్యవహరిస్తున్న యోగేందర్ యాదవ్ గుర్గావ్‌లో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.
 
 తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నా మిగతా యాదవ అభ్యర్థులకు దీటుగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఇక ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఏఎన్‌ఎల్‌డీ) నుంచి మాత్రం ముస్లిం అభ్యర్థి జాకీర్ హుస్సేన్ పోటీ చేస్తున్నారు.
 
 గుర్గావ్‌లోని 1,80,000 మంది ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ నలుగురు అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏప్రిల్ 10న ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. దాదాపు 9 అసెంబ్లీ నియోజకవర్గాలమేర గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం విస్తరించింది. గుర్గావ్, బాద్‌షాపూర్ సెగ్మెంట్లనే హర్యానాలో అతిపెద్దవిగా చెప్పుకుంటారు. ఈ రెండు సెగ్మెంట్లలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో పటౌడీ, రేవారి, బావల్, సో్న, ఫిరోజ్‌పూర్, ఝిర్కా, పున్హానా, నూహ్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. యాదవులు, రావ్‌ల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ లోక్‌సభ నియోజకవర్గంలో వారి ఓట్లు దాదాపు 5,00,000 పైగానే ఉంటాయి. ముస్లిం ఓటర్లు 4,50,000 వరకు ఉన్నారు.
 
 ఇక గెలుపోటములను శాసించే స్థాయిలో జాట్‌ల జనాభా కూడా ఉంది. ఈ ఓటర్ల సంఖ్య దాదాపు 1,50,000 పైనే ఉంటుంది. ఐఎన్‌ఎల్ పార్టీకి ఇప్పటికే జాట్ మద్దతు పుష్కలంగా ఉంది. దీంతో మిగతా సామాజికవర్గాల్లో ఎక్కువగా ఉన్న యాదవులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌లు యాదవ అభ్యర్థులను బరిలోకి దించాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
 
  అయితే సిట్టింగ్ ఎంపీ రావ్ ఇంద్రజీత్ సింగ్‌కు దక్షిణ హర్యానా సమస్యలను పార్లమెంటులో బలంగా వినిపించిన నేపథ్యం ఆయనను గెలిపిస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది.
 
 ఇక పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్  చరిష్మా యోగేంద్ర యాదవ్‌ను గెలిపిస్తాయని ఆప్ నమ్ముతోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఏప్రిల్ 10న జరిగే ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం గెలిచే అభ్యర్థులెవరో చెప్పకనే చెబుతుందంటున్నారు. అందరూ యాదవులే.. మరి ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement