జోరుగా బెట్టింగ్ | betting on general election result | Sakshi
Sakshi News home page

జోరుగా బెట్టింగ్

Published Sun, May 4 2014 2:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

betting on general election result

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :  జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. అయితే నిజామాబాద్ లోక్‌సభతోపాటు నిజామాబాద్ రూరల్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గాల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్థానాల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత, బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, మాజీ మంత్రులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ,  మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి తదితరులు బరిలో ఉండడంతో పోరు రసవత్తరంగా సాగినట్లు తెలుస్తోంది.

 ఈ ఎన్నికలు ఆయా అభ్యర్థులకు ప్రతిష్టాత్మకం కావడంతో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. హోరాహోరీగా సాగిన పోరులో గెలుపుపై అందరూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది చర్చనీయాంశంగా కాగా.. నాలుగు స్థానాల్లో మా నేతలే గెలుస్తారంటూ వారి అనుచరులు భారీస్థాయిలో పందాలు కాస్తుండడం గమనార్హం. స్థాయిని బట్టి రూ. 5 వేల నుంచి రూ. 5 లక్షల వరకు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది.

 నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో గెలుపోటములపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కారు జోరు కొనసాగినట్లు తెలుస్తుండగా లోక్‌సభకు వచ్చేసరికి భిన్నంగా పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీల నుంచి కల్వకుంట్ల కవిత, మధుయాష్కీ గౌడ్, యెండల లక్ష్మీనారాయణ, సింగిరెడ్డి రవిందర్‌రెడ్డి పోటీ చేశారు. అయితే పోలింగ్ నాటికి కవిత, లక్ష్మీనారాయణల మధ్య నువ్వా, నేనా అన్న చందంగా పోటీ మారింది.

నిజామాబాద్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కారు కొంత పైచేయిగా ఉందని, కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో బీజేపీ హవా కొనసాగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణలో బీజేపీ గెలిచే లోక్‌సభ స్థానాల్లో నిజామాబాద్ ఒకటని ఆ పార్టీ వర్గాలు ఢంకా బజాయించి చెబుతున్నాయి. ఇలా ఫలితాలపై అభ్యర్థులు ఎవరికి వారే ధీమాగా ఉండడంతో వారి అనుచరులూ అంతే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు జోరుగా పందాలు కాస్తున్నారు.

 నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసిన డి.శ్రీనివాస్ 1999, 2004లలో వరుసగా నిజామాబాద్ నుంచి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా నిజామాబాద్ రూరల్ నుంచి బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇదేస్థానం నుంచి బరిలో ఉండడంతో పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూటమి అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి సైతం చాపకింద నీరులా గట్టిపోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2009లో ఈ నియోజకవర్గంలో 77.79 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 6.70 శాతం తగ్గింది. అయితే తగ్గిన ఓట్ల శాతం ఎవరికి నష్టం చేస్తుందన్న చర్చ జరుగుతోంది. దాని ఆధారంగానే పందాలు కాస్తున్నారు.

 2009లో కామారెడ్డిలో, 2010 ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో అపజయం పొందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఈసారి మళ్లీ కామారెడ్డిలో బరిలో నిలిచారు. ఆయన గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీలో కీలక బాధ్యతల్లో ఉన్న ఈయనకు తాజా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(టీఆర్‌ఎస్)కు మధ్య నువ్వా? నేనా? అన్న రీతిలో పోరుసాగినట్లు తెలుస్తోంది.

 1999 నుంచి ఓటమెరుగని మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి నాలుగోసారి మాత్రం ఎదురీదారంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్‌కు విజయావకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ గెలిచిన ఏకైక స్థానం బోధన్ కాగా.. ఈసారి కూడ అక్కడ కాంగ్రెస్‌కే అవకాశం ఉంది అన్న చర్చలూ సాగుతున్నాయి. వీరిద్దరే కాకుండా బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డి సైతం తనకూ విజయావకాశాలున్నాయని పేర్కొంటుండడం గమనార్హం. దీంతో ఇక్కడా అభ్యర్థుల గెలుపోటములపై భారీగానే పందాలు కాస్తున్నారు.

 ఈసారీ ఆర్మూరునుంచే బరిలో నిలిచిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి ఎన్నికల్లో సర్వశక్తులొడ్డారు. ఆయన 1989 నుంచి 2004 వరకు బాల్కొండ నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆర్మూరుకు మారిన ఆయన 2009లో ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి సైతం దీటుగా ప్రచారంలో ముందుకెళ్లారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో టీఆర్‌ఎస్‌దే పైచేయిగా నిలిచిందన్న ప్రచారం పోలింగ్ రోజు జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఎవరికి వారే గెలుపు ధీమాతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement