భువనగిరిలో పోటాపోటీ
భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం
నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు: భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగుతుర్తి, ఆలేరు, జనగామ (వరంగల్)
ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)
నియోజకవర్గం ప్రత్యేకతలు: చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఓట్లు కీలకం. ఫ్లోరైడ్ పీడితుల సంఖ్య ఎక్కువ . పట్టణీకరణ వల్ల పెరిగి పోయిన సమస్యలు
ప్రధాన అభ్యర్థుల వీరే
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
- బూర నర్సయ్యగౌడ్ (టీఆర్‌ఎస్)
- చెరుపల్లి సీతారాములు (సీపీఎం)
- నల్లు ఇంద్రాసేనారెడ్డి (బీజేపీ)
- కపిలవాయి దిలీప్‌కుమార్ (రాష్ట్రీయ లోక్‌దళ్)
మొత్తం ఓటర్లు: 14,85,021
ఎన్.క్రాంతి, నల్లగొండ: భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. వరంగల్ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. స్థానిక కేడర్‌ను తయారుచేసుకోలేక పోయినవారు ఆ జిల్లా కేడర్, అసెంబ్లీ అభ్యర్థులపై పూర్తిస్థాయిలో ఆధారపడాల్సి వస్తోంది. కాకపోతే ఏడు సెగ్మెంట్లూ తెలంగాణవాదం బలంగా ఉన్నవి కావడంతో కొంత ఆశతో ఉన్నారు.
గెలుపోటములను ప్రభావితం చేసేవి ఇవే..
భువనగిరి ఎంపీ అభ్యర్థుల గెలుపోటములను ఈ నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. సాగు, తాగునీరు ప్రధానంగా వేధిస్తున్న సమస్యలు. వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ రైతులు గోదావరి, మూసీ నదీ జలాలు అందించాలని ఎంతో కాలంగా కోరుతున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని మునుగోడు సెగ్మెంటులో ఫ్లోరైడ్ సమస్య ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఈ నియోజకవర్గంలో చేనేత రంగంపై ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. వీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే రైల్వే ఆధునికీకరణ, భువనగిరి వరకు మూడో రైల్వే లైను నిర్మాణం, బీబీనగర్- నడికుడి మార్గంలో డబ్లింగ్ పనులు, విద్యుదీకరణ వంటి సమస్యలు ఉన్నాయి.
భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రధానంగా ఆధారపడుతోంది తెలంగాణ సెంటిమెంటు ఓటుపైనే. తెలంగాణ ఇచ్చిన తమకే ప్రజలు పట్టం కడతారనే ధీమాతో కాంగ్రెస్, తెలంగాణ వచ్చిందే తమ పార్టీ వల్ల కాబట్టి ఓట్లన్నీ తమకేనని టీఆర్‌ఎస్, తెలంగాణ ఏర్పాటులో తమదే కీలకపాత్ర కాబట్టి ఓటర్ల మొగ్గు తమవైపేనని బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి. ఇక రాష్ట్రీయ లోక్‌దళ్, సీపీఎంలు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నాయి.
నే.. గెలిస్తే..
- సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తా
- బీబీనగర్ నిమ్స్‌ను అభివృద్ధి చేస్తా
- చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తా
- భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌గా ఏర్పాటు చేయిస్తా
- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్)
అనుకూలం
- అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన సిట్టింగ్ అభ్యర్థులు
- తెలంగాణ వాదాన్ని పార్లమెంటులో బలంగా వినిపించారన్న పేరు
- తెలంగాణ ఉద్యమంలో కనిపించడం
ప్రతికూలం
- తెలంగాణ సెంటిమెంటు ఓటు చీలిపోయే అవకాశం
- సంస్థాగతంగా ఉన్న గ్రూపులు
- ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా
- బీబీనగర్ నిమ్స్‌ను ప్రారంభించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయిస్తా
- పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తా
- బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లాలో జ్యూస్ ఆధారిత కంపెనీలు ఏర్పాటు చేయిస్తా.
- నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ)
అనుకూలం
- తెలంగాణ కోసం పనిచేసిన గుర్తింపు
- గతంలో ఈ నియోజకవర్గ ప్రజలతో ఉన్న పరిచయాలు
ప్రతికూలం
- పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం
- స్థానికేతరుడు కావడం
- ప్రజలకు వైద్య సేవల సమాచారంపై ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తా
- సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తా
- ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తా
- బూర నర్సయ్యగౌడ్ (టీఆర్‌ఎస్)
అనుకూలం
- ఉద్యమ పార్టీ అభ్యర్థి కావడం
- డాక్టర్స్ జేఏసీలో కీలకంగా పనిచేయడం
ప్రతికూలం
- తెలంగాణ సెంటుమెంటుపైనే ఆధారపడడం
- రాజకీయాలకు కొత్త కావడం
- భువనగిరి పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా మారుస్తా
- పెద్ద చెరువులను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా మారుస్తా
- నల్లగొండలో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తా
- భువనగిరి, కొలనుపాకను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తా
- దిలీప్‌కుమార్ (ఆర్‌ఎల్‌డీ)
అనుకూలం
- టీఆర్‌ఎస్‌లో పనిచేసినప్పుడున్న పరిచయాలు
- ఎమ్మెల్సీగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం
ప్రతికూలం
- టీఆర్‌ఎల్డీ బలహీనంగా ఉండడం
- క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు లేకపోవడం
- సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తా
- పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయిస్తా
- {పజలకు నిత్యం అందుబాటులో ఉంటా
- భువనగిరి పట్టణాన్ని మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేస్తా.
- కులవృత్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటా
- చెరుపల్లి సీతారాములు (సీపీఎం)
అనుకూలం
- సీపీఎం సంప్రదాయ ఓటు బ్యాంకు
- కార్మిక వర్గంలో పట్టుండడం
- చేనేత వర్గానికి చెందిన అభ్యర్థి కావడం
ప్రతికూలం
- సమైక్యవాద పార్టీ అన్న ముద్ర
- తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడం
- సగం అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ బలహీనంగా ఉండడం
పోల్ పదనిసలు
మూడుసార్లు... మూడు సెగ్మెంట్లు
ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రతిసారీ కొత్త నియోజకవర్గాన్ని ఎంచుకుంటున్న బొజ్జపల్లి రాజయ్య ముచ్చటగా మూడోసారి కూడా కొత్త నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు. 1985లో వరంగల్ జిల్లా పరకాల ఎస్సీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆయన 1999లో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడంతో అక్కడి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వర్ధన్నపేట నుంచి బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.
- న్యూస్‌లైన్, హన్మకొండ
అలుపెరగని అజ్మీరా
వరంగల్ జిల్లాకు చెందిన మాజీమంత్రి అజ్మీరా చందూలాల్ తొమ్మిదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎనిమిది పర్యాయాలు పోటీచేసి గెలుపోటములు చవిచూసిన ఆయన ప్రస్తుతం ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ మంత్రులు ఎన్.యతిరాజారావు, కమాలుద్దీన్ అహ్మద్‌లు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కలిపి తొమ్మిది పర్యాయాలు బరిలో నిలిచినవారే. ఇదే జిల్లాకు చెందిన చందుపట్ల జంగారెడ్డి ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు పోటీ చేశారు.
ప్రస్తుతం పోటీలో ఉన్న చందూలాల్ తొలిసారి ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా 1983లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తిరిగి 1989లో ఓడిపోయారు. మళ్లీ 1994లో విజయం సాధించారు. 1996,1998లో వరంగల్ ఎంపీగా బరిలోకి దిగి విజయ కేతనం ఎగరవేశారు. 1999లో తిరిగి ములుగు ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2009లో మహబూబాబాద్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తాజాగా ములుగు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
- న్యూస్‌లైన్, వరంగల్
సిద్దిపేట.. హ్యాట్రిక్‌ల కోట
సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన పలువురు హ్యాట్రిక్ కొట్టారు. ఇక్కడి నుంచి 1967 ఎన్నికల్లో పోటీ చేసిన జి.వెంకటస్వామి 1971,1977లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టగా నంది ఎల్లయ్య 1989, 1991, 1996లో విజయం సాధించారు. సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి అనంతుల మదన్‌మోహన్ 1972, 1978, 1983లో గెలుపొందారు. ఇక టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ సాధించారు. అదే పార్టీ ముఖ్యనేత టి.హరీష్‌రావు 2004, 2008, 2009, 2010 ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు.