బీజేపీవి విచ్ఛిన్నకర రాజకీయాలు
కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ధ్వజం
ఓటర్ల మనసులను విషపూరితం చేస్తోందని వ్యాఖ్య
మధురై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి వివాదాస్పద అంశాలను మేనిఫెస్టోలో చేర్చడం ద్వారా బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ఆ పార్టీకి ఓటు వేయనివారిని వదిలేసి, మోజార్టీ వర్గాల ఓట్లను దండుకునేందుకు వారి మనసులను విషపూరితం చేస్తోందని మండిపడ్డారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. రామమందిరం, ఉమ్మడి పౌరస్మృతి, జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేయడం వంటి వివాదాస్పద అంశాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయని, అంతేకాకుండా సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు.
‘‘వారు(బీజేపీ) ప్రజల్లోని అన్ని వర్గాల ఓట్లనూ పట్టించుకోవడంలేదు. మెజార్టీల ఓట్లను మాత్రమే పొందాలన్నది వారి అజెండా. మైనార్టీల ఓట్లు తమకు అవసరం లేదని వారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వారి ప్రయత్నమంతా మెజార్టీ ఓట్ల కోసమే’’ అని దుయ్యబట్టారు. పదేళ్లుగా ఈ అంశాల్ని పక్కనపడేసి డ్రామాలాడిన బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల సమయంలో విషపూరిత ఆలోచనలతో ఓటర్లను కలుషితం చేయాలని భావిస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగా తమ సొంత ఓటుబ్యాంకును సంఘటితం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు.
తమకు ఓటు వేయనివారి సంక్షేమం గురించి బీజేపీ పట్టించుకుంటుందని తాను భావించడంలేదని చెప్పారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన విధానాలు, పథకాలకు కాపీయే బీజేపీ మేనిఫెస్టో అని ఆరోపించారు. వారు తమ ఐడియాలన్నీ కాపీ చేశారని విమర్శించారు. కాపీ చేయడం తప్పు కాదని, అయితే వారు దాన్ని అంగీకరించాలని పేర్కొన్నారు.