
పొత్తుపై పునరాలోచన !
టీడీపీతో దోస్తీపై బీజేపీలో అంతర్మథనం
ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు బెట్టుతో
బీజేపీ అధినాయకత్వంలో చిరాకు
సాక్షి, న్యూఢిల్లీ: నిన్నటిదాకా బీజేపీతో జతకట్టేందుకు తహతహలాడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. సీట్ల సర్దుబాబు విషయంలో అనుసరిస్తున్న వైఖరి బీజేపీ అధినాయకత్వానికి చిరాకు తెప్పిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అసలు బాబుతో పొత్తు ఎందుకని ఇప్పటికే అటు తెలంగాణ బీజేపీ నాయకులు తేల్చి చెప్పగా.. ఇప్పుడు సీమాంధ్ర బీజేపీ నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం అంతర్మథనంలో పడింది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ చూసి ఆయనతో జతకట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పడిగాపులు కాశారు. అయితే ఇటీవల టీడీపీలోకి వలసలు పెరగడంతో బాబు తన వ్యూహం మార్చారు. పొత్తుకు సరే అన్నా.. బీజేపీ అధినాయకత్వం అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఇప్పటికే పొత్తు రాయబారం నడిపేందుకు వచ్చిన బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్ ఇదే విషయాన్ని తన పార్టీ అధిష్టానానికి నివేదించారు. రాష్ట్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండడంతో బీజేపీ అధినాయకత్వం తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీతో పొత్తు అవసరమా అన్న మీమాంసలో పడింది.
చంద్రబాబు కొత్త కండిషన్లు: బీజేపీ అధిష్టానం నుంచి తెలంగాణ, సీమాంధ్రకు సంబంధించి సీట్ల సర్దుబాబు విషయంలో టీడీపీకి రెండు ప్రతిపాదనలు వచ్చాయి. సీమాంధ్రలో 6 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే స్థానాలను తమకు ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించింది. అలాగే తెలంగాణలో టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అక్కడ 60 ఎమ్మెల్యే, 11 ఎంపీ సీట్లు తమకు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. చివరికి సీమాంధ్రలో 18 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలకు, తెలంగాణలో 9 ఎంపీ, 55 నుంచి 53 వరకు ఎమ్మెల్యే సీట్లు తమకు కేటాయించినా సర్దుకుపోయేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇరు ప్రాంతాల్లో అన్ని సీట్లు సర్దుబాబు చేయలేమని బాబు కొత్త కండిషన్లు తెరపైకి తెస్తూ పొత్తులకు సుముఖంగా లేనట్టుగా వ్యవహరించారని.. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో పొత్తులపై ఏం చేయాలో మీరే తేల్చుకోవాలంటూ సీమాంధ్ర, తెలంగాణ కమిటీలకు బీజేపీ అధినాయకత్వం తేల్చి చెప్పింది. ముందునుంచే టీడీపీతో పొత్తుకు వ్యతిరేకత వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ నాయకులంతా ఇప్పుడు ముక్తం కంఠంతో పొత్తు వద్దేవద్దని సూచిస్తున్నారు.
అసెంబ్లీ స్థానాలపై కాస్త తగ్గుదాం!: అయితే.. టీడీపీతో పొత్తు పెట్టుకొనే ఎన్నికలకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్న బీజేపీ తెలంగాణ సీనియర్ నేతలు పలువురు.. ఈ అంశంపై పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని భావిస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీ స్థానాల విషయంలో కాస్త వెనక్కు తగ్గటం మంచిదేనని అధిష్టానంతో చెప్పాలన్నది వారి ఉద్దేశంగా తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా జవదేకర్
తెలంగాణ, సీమాంధ్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్‌జవదేకర్‌ను పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నియమించారు. మరోనేత రాజ్‌పురోహిత్‌ను కో-ఇన్‌చార్జ్‌గా నియమించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.