
బీజేపీ, టీడీపీ పొత్తుపై తేలని లెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఎటూ తేలక ప్రతిష్టంభన ఏర్పడిన బీజేపీ-తెలుగుదేశం పార్టీల పొత్తు వ్యవహారం ఢిల్లీకి మారింది. మూడు రోజుల పాటు నగరంలో మకాం వేసిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక తుదకు బాధ్యతను అధిష్టానానికి అప్పగించేశారు. పలు దఫాలుగా పార్టీ నేతలతో చర్చలు జరిపిన ఆయన ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లిపోయారు. వాస్తవానికి ఆదివారం పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ హైదరాబాద్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన స్థాయిలో కూడా ఈ అంశం కొలిక్కి వచ్చే అవకాశం లేదన్న ఉద్దేశంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వద్దే మాట్లాడదామని జవదేకర్‌నే ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. దీంతో ఇక పొత్తుల సంగతి ఢిల్లీలోనే తేలాల్సి ఉంది.
పట్టు వీడని నేతలు...
తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ దేశంతో పొత్తుకు ససేమిరా అంటున్న రాష్ట్ర కమలనాథుల్లో కొందరు... వీలైనన్ని స్థానిక పార్టీలతో పొత్తులు, అవగాహనలతో ఎన్నికలకు వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి కాస్త మెత్తబడ్డా సీట్ల సర్దుబాటు విషయంలో మాత్రం వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేరు. కచ్చితంగా 60కి తగ్గకుండా ఎమ్మెల్యే స్థానాలు, 9 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీ చేయాల్సిందేనని ఖరాఖండిగా చెప్పేశారు. జవదేకర్‌తో ఆదివారం ఉదయం మరోసారి భేటీ అయిన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. జవదేకర్‌తో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడిన టీడీపీ నేత సుజనాచౌదరి, బీజేపీకి 40 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం లేదని చెప్పటాన్ని కిషన్‌రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి స్థానికంగా గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నందున, ఈ సంఖ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గొద్దని స్పష్టంచేశారు. టీడీపీకూడా మొండిపట్టుమీదే ఉంటే పొత్తు విషయంలో పునరాలోచించటమే ఉత్తమమనే సంకేతాన్ని ఆయన అధిష్టానానికి పంపారు. దీంతో చేసేదీమీ లేక జవదేకర్ విషయాన్ని అటు అరుణ్‌జైట్లీకి, ఇటు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌కు తెలిపి ఢిల్లీ విమానమెక్కారు. మరోవైపు పొత్తు విషయం సుతరామూ ఇష్టంలేని ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నేత ఒకరు ఆదివారం కిషన్‌రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. గెలిచే అవకాశం ఉన్న స్థానాలను పొత్తు పేరుతో వదులుకోవద్దని సూచించినట్టు తెలిసింది.
నాలుగైదు ఎంపీ స్థానాలు గెలవడం ముఖ్యం..
మరోవైపు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా రాష్ట్ర నేతలతో ఆదివారం మాట్లాడినట్టు తెలిసింది. తెలంగాణ నుంచి నాలుగైదు ఎంపీ స్థానాలు రావటమే ఇప్పుడు ముఖ్యమని, అది పొత్తుతోనా... లేకుండానా అనేది మీరే నిర్ణయించుకోండని పేర్కొన్నట్టు సమాచారం. దీంతో పొత్తు వద్దనే కిషన్‌రెడ్డి సహా ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు బలం చేకూరినట్టయింది. తెలంగాణలో ‘ఏ’ కేటగిరీగా పార్టీ గుర్తించిన ఆరు స్థానాల్లో కచ్చితంగా నాలుగు స్థానాలు గెలవగలమనే ధీమాను మోడీకి కలిగించాలని వారు భావిస్తున్నారు.