
టీడీపీతో పొత్తు తప్పదు.. సర్డుకుపోండి
టీడీపీతో దోస్తీపై బీజేపీ రాష్ట్ర నేతలకు జవదేకర్ స్పష్టీకరణ
జైట్లీ దూతగా వచ్చి.. ఇరు ప్రాంత నేతలతో భేటీ
తెలంగాణలో కనీసం 8 లోక్‌సభ సీట్లకు పట్టుబట్టాలని స్థానిక నేతల యోచన
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, తెలుగుదేశం పొత్తుపై ఉత్కంఠ వీడుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమైంది. ఇక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. పొత్తు బాధ్యతను నెత్తికెత్తుకున్న పార్టీ నేత అరుణ్‌జైట్లీ దూతగా వచ్చిన ప్రకాశ్ జవదేకర్.. జాతీయ నాయకత్వం మనసులోని మాటను పార్టీ రాష్ట్ర నేతలకు వివరించారు. పొత్తు అనివార్యమని, సర్దుకుపోవాలని సూచించారు. 19న ఢిల్లీలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశం పొత్తుల వ్యవహారాన్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నేతల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు జవదేకర్ హుటాహుటిన ఆదివారం హైదరాబాద్ వచ్చారు. పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. పొత్తుపై తుది నిర్ణయాన్ని ప్రకటించబోయే ముందు పార్టీ రాష్ట్ర నేతల్ని సంప్రదించమని పార్లమెంటరీ బోర్డు ఆదేశించిందని, అందుకే వచ్చానని చెబుతూనే.. జాతీయ అవసరాల దృష్ట్యా చంద్రబాబుతో పొత్తు అవసరమని కేంద్ర నాయకత్వం భావిస్తోందని ఆయన చెప్పినట్టు తెలిసింది. ఒక రాష్ట్రంలో పొత్తుకు టీడీపీ అంగీకరించడం లేదని, ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉండాలి.. లేకుంటే అవసరం లేదని చంద్రబాబు చెబుతున్నట్టు వివరించారు. దీంతో తెలంగాణ నేతలు కొందరు తొలుత ఆవేదన వ్యక్తం చేసినా.. జాతీయ పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
ఎనిమిదికి పట్టుబట్టాలని నిర్ణయం:
బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆదివారం మరోసారి భేటీ అయింది. పొత్తుతో నిమిత్తం లేకుండా కసరత్తు ప్రారంభించిన నేతలు జవదేకర్‌తో భేటీ అనంతరం కనీసం 8 లోక్‌సభ సీట్లకైనా పట్టుబట్టాలనుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పరిస్థితి మారినందున తమదే పైచేయి కావాలని బీజేపీ కోరుకుంటున్నప్పటికీ, టీడీపీ అందుకు సిద్ధంగా లేదు. పొత్తులో భాగంగా 2004లో బీజేపీ.. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, నల్లగొండలో పోటీ చేసి అన్ని చోట్లా ఓటమి పాలైంది. ఇప్పుడు తెలంగాణ తెచ్చింది తామేనన్న నినాదంతో ముందుకు వెళ్లాలనుకుంటోంది. ప్రస్తుతం గుర్తించిన తొలి కేటగిరీ సీట్లు- సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నిజమాబాద్, భువనగిరి, కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు మెదక్ లేదా జహీరాబాద్, మహబూబాబాద్ లేదా ఏదైనా ఒక ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాన్ని కోరాలనుకుంటున్నట్టు తెలిసింది. అయితే మల్కాజ్‌గిరి సీటుపై టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ సీటు నుంచే చంద్రబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్న సీమాంధ్రులు తెలుగుదేశం పార్టీకైతేనే ఓట్లు వేస్తారని వాదిస్తుండగా, బీజేపీ తోసిపుచ్చుతోంది. ఈ సీటు తనకే కచ్చితంగా వస్తుందని భావిస్తున్న ఇంద్రసేనారెడ్డి.. ఇప్పటికే ప్రచారం కూడా చేపట్టారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఓ సామాజిక వర్గం ఓట్లు తమకు తప్ప వేరే వారికి పడవని వివరించడానికి బీజేపీ అన్ని గణాంకాలతో సిద్ధమైంది.
ఈ వారంలో తేల్చేస్తాం
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా, ఉండదా అన్న ప్రశ్నకు ప్రకాశ్ జవదేకర్ సూటిగా సమాధానమివ్వలేదు. ఈ విషయాన్ని ఈ వారంలో తేల్చేస్తామని విలేకరులకు వివరించారు. ప్రస్తుతం మాట్లాడుతున్నామని, తర్వాత చెబుతామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుందని, 300కి పైగా సీట్లు బీజేపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ మరిన్ని సీట్లు సాధించగలమన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిపోయినందున ఓటమి నెపాన్ని ప్రధాని మన్మోహన్‌పై మోపి సోనియాను, రాహుల్‌ను కాపాడే ప్రయత్నం మొదలైందని.. కాంగ్రెస్ నేత పీసీ చాకో ప్రధానిపై చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనమని జవదేకర్ విమర్శించారు.