టీడీపీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తు ధర్మానికి చంద్రబాబు విఘాతం కలిగించారని విమర్శించారు.
హైదరాబాద్: టీడీపీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పొత్తు ధర్మానికి చంద్రబాబు విఘాతం కలిగించారని విమర్శించారు. బీజేపికి కేటాయించిన గుంతకల్లు, సంతనూతలపాడు, కడప అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉంటే టీడీపీ అభ్యర్ధులను సస్పెండ్ చేయాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ అధికారిక అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిపై వెంటనే క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల నిన్న డిమాండ్ చేశారు. ఆయా స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారని రెండు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో ఆ పార్టీ చెప్పిందని, కానీ అలా జరగలేదని విమర్శించారు. నామినేషన్లు ఉపసంహరించుకోని ఆ ముగ్గురు అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని.. దానిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.