సైకిల్ జోరు
పదేళ్ల తర్వాత జిల్లాలో తెలుగుదేశం పతాకం రెపరెపలాడింది. మరోవైపు తొలిసారి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. మెట్ట, ఏజెన్సీల్లో మంచిపట్టు సాధించింది. టీడీపీ పొత్తుతో రాజమండ్రి సిటీలో బీజేపీ పాగా వేయగా, టికెట్ రాక భంగపడిన టీడీపీ రెబల్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ అత్యధిక మెజారిటీతో పిఠాపురాన్ని దక్కించుకున్నారు. మూడుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎం.ఎం.పళ్లంరాజు మళ్లీ కాంగ్రెస్ నుంచి బరిలో దిగి ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. జై సమైక్యాంధ్ర నుంచి పోటీ చేసినా అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్‌కు అదే అనుభవం తప్పలేదు.
సాక్షి, కాకినాడ :మహా సంగ్రామాన్ని తలపిస్తూ సాగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజల తీర్పు టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపగా..వైఎస్సార్ సీపీ శ్రేణులకు మనోనిబ్బరాన్నిచ్చింది. మున్సిపల్, ప్రాదేశిక విజయాలకు కొనసాగింపుగా సార్వత్రిక పోరులో కూడా గెలుపు దక్కడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అన్నీ తమకు అనుకూలంగానే ఉన్నా.. ఐదు స్థానాలే దక్కడంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే తమ పార్టీ బరిలోకి దిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ స్థాయిలో స్థానాలను దక్కించుకోవడం చిన్న విషయం కాదని, పార్టీ ఉజ్వల భవిష్యత్తుకు ఇది నాంది అని ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 130 ఏళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌తో పాటు సమైక్యఉద్యమ ముసుగులో పుట్టుకొచ్చిన జై సమైక్యాంధ్ర పార్టీని జిల్లా వాసులు ఛీత్కరించారు. ఎన్టీఆర్ ప్రభంజనంలో తొలిసారి 1984 ఎన్నికల్లో జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలను చేజిక్కించుకున్న టీడీపీ మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత ఆ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక 19 అసెంబ్లీ స్థానాల్లో 12 చోట్ల విజయం సాధించింది. ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందగా, టీడీపీ రెబల్ పిఠాపురంలో సత్తా చాటారు.జిల్లాలోని మూడు ఎంపీ స్థానాలకు 50 మంది, 19 అసెంబ్లీ స్థానాలకు 250 మంది తలపడ్డారు. అయితే పోరు మాత్రం వైఎస్సార్ సీపీ-టీడీపీల మధ్యే సాగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా కొన్ని చోట్ల టీడీపీ, మరికొన్ని చోట్ల వైఎస్సార్ సీపీ రౌండ్‌రౌండ్‌కూ ఆధిక్యతను పెంచుకుంటూ వెళ్లాయి. అయితే కాకినాడ ఎంపీ స్థానంతో పాటు అనపర్తి, అమలాపురం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం ఇరు పార్టీల మధ్య దోబూచులాడింది.
బొటాబొటి మెజారిటీతో గట్టెక్కిన నరసింహం
ప్రశాంతంగా సాగిన కౌంటింగ్‌లో తొలుత మెజారిటీ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యతను కనపర్చినా తర్వాత టీడీపీ పుంజుకుని 12 చోట్ల గెలుపొందింది. వైఎస్సార్ సీపీ కూడా గణనీయమైన ఓట్లను సాధించడంతో పాటు ఐదు స్థానాల్లో విజయం దక్కించుకుంది. పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు గట్టిపోటీనిచ్చి టీడీపీ అభ్యర్థులకు చెమటలు పట్టించారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ 17వ రౌండ్ వరకు స్పష్టమైన ఆధిక్యతను కనపరిచారు. అయితే టీడీపీ అభ్యర్థి తోట నరసింహం తర్వాత నాలుగు రౌండ్లలో పుంజుకున్నారు. గతంలో జగ్గంపేట ఎమ్మెల్యేగా అత్యల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టే ఎంపీగా కేవలం 3,431 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఇక అమలాపురం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పండుల రవీంద్రబాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై 1,20,676 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
రాజమండ్రి ఎంపీగా టీడీపీ అభ్యర్థి, సినీనటుడు మాగంటి మురళీమోహన్ లక్షా 38 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయంసాధించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నుంచి గెలుపొందగా, మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి, గొల్లపల్లి సూర్యారావు రాజోలు నుంచి గెలుపొందారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, పులపర్తి నారాయణమూర్తి, పిల్లి అనంతలక్ష్మి, వనమాడి వెంకటేశ్వరరావు మరోసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. బీజేపీ తరఫున ఆకుల సత్యనారాయణ రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందారు. టీడీపీ టికెట్ రాక రెబల్‌గా పిఠాపురం నుంచి బరిలో దిగిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఘన విజయం సాధించారు. టీడీపీ తరఫున అమలాపురం, ముమ్మిడివరం, అనపర్తిలలో గెలిచిన అయితాబత్తుల ఆనందరావు, దాట్ల బుచ్చిరాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.