అక్కడ పొత్తులు..ఇక్కడ కత్తులు | TDP, BJP still thrashing out seat-sharing issues | Sakshi
Sakshi News home page

అక్కడ పొత్తులు..ఇక్కడ కత్తులు

Published Wed, Apr 9 2014 12:37 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అక్కడ పొత్తులు..ఇక్కడ కత్తులు - Sakshi

అక్కడ పొత్తులు..ఇక్కడ కత్తులు

 సాక్షి ప్రతినిధి, కాకినాడ :కమలనాధులతో పొత్తు నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు కత్తులు నూరుకునే పరిస్థితి తలెత్తింది. ఓటమి భయంతో బీజేపీకి వదిలేందుకు సిద్ధపడిన రెండు స్థానాలపై టీడీపీలో అంతర్గత పోరు సాగుతోంది. రాజమండ్రి సిటీ, రాజోలు అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి విడిచిపెట్టేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనిపై అధికారిక ప్రకటన   వెలువడడం ఒక్కటే తరువాయి. అయితే టీడీపీలో ఆశావహు లు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజమండ్రి సిటీ బీజేపీకి కేటాయించాలనే నిర్ణయంపై తెలుగుతమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి చెక్ పెట్టే లక్ష్యంతోనే వ్యూహాత్మకంగా ఈ సీటును బీజేపీకి వదిలే నిర్ణయానికి వచ్చినట్టు గోచరిస్తోంది. కాగా చంద్రబాబు తీరుపై  గోరంట్ల వర్గం ఆగ్రహంతో ఊగిపోతోంది.
 
 మంగళవారం గోరంట్ల మద్దతుదారులు మూకుమ్మడిగా రాజమండ్రి టీడీపీ కార్యాలయం వద్ద నిరసన వెళ్లగక్కారు. గోరంట్లకు రాజమండ్రి సిటీ సీటు కేటాయించాలనే డిమాండ్‌తో వారు బాబుకు ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. 30 ఏళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న గోరంట్ల సీటుకే ఎసరు పెడతారా ? అంటూ మద్దతుదారులు తీవ్ర నిసనన వ్యక్తం చేశారు. గోరంట్లను కాదని బీజేపీకి సీటు కేటాయిస్తే బాబు మాటను కూడా లెక్క చేయబోమని, నోటాకు ఓటేసి అధిష్టానానికి తమ వ్యతిరేకతను స్పష్టం చేస్తామని వారు హెచ్చరించారు. టీడీపీ నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు తదితరులు చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. 
 
 రాజమండ్రి సిటీ సీటు చేజారుతోందని తెలియడంతోనే గోరంట్ల హైదరాబాద్ వెళ్లారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా పలువురు నేతలను కలసి సీటు బీజేపీకి పోకుండా ఆపేం దుకు ఆయన హైరానా పడుతున్నారని పార్టీ వర్గాలంటున్నా యి. గత ఎన్నికల్లో రాజమండ్రి సిటీ, రాజమండ్రి పార్లమెంటు సీట్లలో బీజేపీకి వచ్చిన ఓట్లు 2000, 8000 లోపేనని, అటువం టి పార్టీకి రాజమండ్రి సిటీ సీటు ఎలా ఇస్తారని గోరంట్ల అధిష్టానం వద్ద నిరసన వ్యక్తం చేశారని ఆయన వర్గం చెబుతోంది. ఏదో రకంగా సీటు చేయిదాటకుండా చూసేందుకు  గోరంట్ల హైదరాబాద్‌లోనే మకాం వేసి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఈ యత్నాలను తిప్పికొట్టేందుకు గన్ని కృష్ణ వర్గం పావు లు కదుపుతోంది. వరుస పరాజయాలు ఎదుర్కొంటూ ప్రజాబలం కోల్పోయిన గోరంట్లకు దక్కడం కంటే వ్యూహాత్మకంగా ఈ సీటును బీజేపీకి వదిలేయడమే మంచిదని గన్ని వర్గం భావిస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ వద్దకు గోరంట్లకు వ్యతిరేకంగా వెళ్లిన నివేదిక ఆసరాగా గోరంట్లకు సీటు రాకుండా చేయాల్సినంతా చేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. గోరంట్లకు సీటు దక్కకుండా లక్ష్యమన్నట్టుగా గన్ని వర్గం ప్రయత్నిస్తోంది.
 
 పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగుతున్న రాజోలు సీటుపై కూడా టీడీపీలో వర్గపోరు నెలకొంది. రాజోలు సీటు బీజేపీకి కేటాయించే క్రమంలో ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా లైన్‌లో ఉన్నారు. పొత్తు వల్ల సీటు కోల్పోతోన్న బత్తుల రాము రాజకీయ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాల వల్లనే రాజోలు సీటు బీజేపీకి పోతోందని, ఇందుకు రాము వైఖరే కారణమని ప్రత్యర్థివర్గం ప్రచారం చేస్తోంది. రామును వెంటేసుకు తిరగడం ద్వారా ఈ పరిస్థితికి కారణమయ్యారంటూ టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భూపతిరాజు ఈశ్వరరాజువర్మపై రాము వ్యతిరేక వర్గం సోమవారం ఒక సమావేశంలో మండిపడటం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. రాము అసమర్థత వల్లనే బీజేపీకి సీటు అర్పించుకోవలసి వస్తోందని ఇదే స్థానం కోసం ప్రయత్నించిన  గేదెల వరలక్ష్మి,  మోకా పార్వతి సహా నేతలు బిక్కిన రామం, ముదునూరి చినబాబు తదితరులుఅసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి ఇచ్చినా, ఇవ్వకున్నా రామును మాత్రం అంగీకరించేది లేదని ఆ వర్గం తెగేసి చెబుతోంది.
 
 మరోపక్క బీజేపీ సీటును సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఇప్పించేలా బీజేపీ, టీడీపీలపై ఒత్తిడి తెచ్చేందుకు మాజీ స్పీకర్, ఒకప్పటి రాపాక గురువు ఏవీ సూర్యనారాయణరాజు వర్గీయులు పావులు కదుపుతున్నారు. ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న రాము స్థానిక సంస్థలకు అభ్యర్థులను నిలిపినందున ఎన్నికలయ్యే వరకు వేచిచూద్దామనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది.  ఉన్నట్టుండి ఈ సీటు బీజేపీకి ఇచ్చేస్తున్నామని బాబు ఫోన్ చేసి చెప్పేస్తే...  ఇంతకాలం పార్టీ కోసం లక్షలు వెచ్చించి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చిన రాము ఏమైపోవాలని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ఇలా అవమానాలను ఎదుర్కొని పార్టీలో ఉండడంకంటే బయటకుపోయి స్వతంత్రంగా పోటీచేయాలని అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ రకంగా బీజేపీతో పొత్తు ద్వారా జిల్లాలో ఆ పార్టీ నేతలు కత్తులు నూరుకునే పరిస్థితికి చంద్రబాబు కారణమయ్యారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement