దిశాదన్నూ లేని పోరు
దిశాదన్నూ లేని పోరు
Published Thu, Apr 3 2014 4:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేని తెలుగుదేశం
ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహులను పీడిస్తున్న అభద్రతాభావం
ప్రాదేశిక పోరులో మొక్కుబడి ప్రచారానికే పరిమితం
అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న జెడ్పీటీసీ అభ్యర్థులు
సాక్షి, కాకినాడ :జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన తెలుగుదేశం అభ్యర్థులకు దిక్కుతోచక జుట్టు పీక్కునే పరిస్థితి ఎదురవుతోంది. పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ఇప్పటి వరకూ తేలలేదు. ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథులూ లేరు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్న వారు కూడా పార్టీ అధిష్టానం పోకడతో.. తమకు అవకాశం వస్తుందో, రాదో తెలియని స్థితిలో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో తూతూమంత్రంగా పాల్గొంటున్నారు. దీంతో తమ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని జెడ్పీటీసీ అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభంజనంలా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ ‘ఫ్యాన్’ గాలి ముందు..‘సైకిల్’పై గెలుపు గమ్యం చేరడం కష్టతరమని తెలిసినప్పటికీ.. టీడీపీ వారు జిల్లా పరిషత్ పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే ప్రతిసారీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ముందే ఖరారు చేసే టీడీపీ.. ఈసారి ఆ రివాజుకు భిన్నంగా అభ్యర్థి ఎవరో తేల్చలేకపోయింది. తొలుతపార్టీ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పను బరిలోకి దింపాలని భావించినా చివరి నిముషంలో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.
జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబును జెడ్పీ చైర్మన్ రేసులో నిలబెట్టి, తన అల్లుడు, మాజీ మంత్రి తోట నరసింహంకు లైన్ క్లియర్ చేసుకోవాలని మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు భావించారు. అదే ఆలోచనతో జిల్లా నాయకత్వం ద్వారా చంటిబాబుపై ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు చంటిబాబు విముఖత ప్రదర్శించడంతో చైర్మన్ అభ్యర్థిత్వం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ముందే అభ్యర్థిత్వం ఖరారు చేయాలన్న ఆలోచనను విరమించుకుంది. ఐ.పోలవరం జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్, పి.గన్నవరం జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న నామన రాంబాబు ప్రస్తుతం జెడ్పీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు మరికొందరు.. తమకూ చైర్మన్‌పీఠాన్ని అధిరోహించే అర్హతలన్నీ ఉన్నాయని చెబుతున్నారు. చైర్మన్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో బరిలో నిలిచిన అభ్యర్థులను పట్టించుకునే వారే కరువయ్యారు.
అవకాశంపై ఏదీ హామీ?
దీనికి తోడు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశిస్తున్న నేతలూ జెడ్పీటీసీ అభ్యర్థులను పట్టించుకోవడం లే దు. అందుకు కారణం..టికెట్ తమకు దక్కుతుందన్న నమ్మకం లేకపోవడమే. దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారిని కాదని, అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కట్టబెట్టే సంస్కృతికి అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడమే ఇందుకు కారణం.
వలసనేతలపై మొగ్గు చూపుతున్న బాబు పార్టీ కోసం పనిచేస్తున్న తమకు టిక్కెట్లు ఇస్తారో, లేదోననే ఆందోళన వారికి కంటి కి కునుకును కరువు చేస్తోంది. టిక్కెట్లు ఖరారు చేసిన వారిని కూడా చివరి క్షణంలో పక్కన పెట్టి కొత్తవారికి అవకాశమిచ్చే పరిస్థితులు నెలకొనడంతో ఆశావహులకు ప్రాదేశిక పోరుపై ఆసక్తి సన్నగిల్లింది. బరిలో నిలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను పార్టీ అధిష్టానమే కాదు.. చివరికి జిల్లా నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదు. జెడ్పీ చైర్మన్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడంతో.. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక వనరుల కోసంఎవరిని అడగాలో అర్థం కావడం లేదని కోనసీమకు చెందిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ‘సాక్షి’ వద్ద వాపోయారు. మొత్తమ్మీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి ఆశలపై ఆ పార్టీ నాయకులే నీళ్లు చల్లుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Advertisement