సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక సమరంలో తుది అంకానికి సర్వం సిద్ధమైంది. నేడే పోలింగ్ జరగనుంది. ఈసారి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవచూపి గంటపాటు పోలింగ్ సమయం పెంచింది. దీంతో ఉదయం 7గంటలకు ఓటింగ్‌ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 5,042 పోలింగ్ కేంద్రాల్లో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పోలింగ్ ప్రక్రియలో ప్రత్యక్ష్యంగా 33,277 మంది సిబ్బంది పాల్గొంటుండగా.. పరోక్షంగా మరో 40 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు.
ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని పంపిణీ చే శారు. దీంతో మంగళవారం సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద మౌలికవసతులు సరిగాలేవంటూ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తాండూరులో వందమందికి పైగా సిబ్బందికి వడదెబ్బ తగలడంతో అక్కడ కొంత ఉద్రిక్తవాతావరణం నెలకొంది. వెంటనే సమీపంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో అస్వస్థతకు గురైన సిబ్బందికి చికిత్స నిర్వహించారు.
బరిలో 329 మంది అభ్యర్థులు
ఎన్నికల బరిలో జిల్లా నుంచి 329 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 284 మంది అభ్యర్థులు కాగా, రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు గెలుపుకోసం తుదివరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సాయంత్రానికే ప్రచారపర్వం ముగిసిన ప్పటికీ అభ్యర్థులు తమ అనుచరగణంతో అంతర్గత ప్రచారం సాగిస్తున్నారు. ఎవరికి తోచినట్టు వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంచన లేకుండా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నగదు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది. మద్యం దుకాణాలు మూసివేసినప్పటికీ అభ్యర్థుల ముందు జాగ్రత్తతో ఈ వ్యవహారం సాఫీగా సాగుతోంది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే సమయం కావడంతో ఎవరికివారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రత్యర్థులను చిత్తుచేసేందుకు కృషి చేస్తున్నారు. చివరగా అభ్యర్థులంతా పోల్‌మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు: 14
లోక్‌సభ నియోజకవర్గాలు: 2
ఓటర్లు: 53,48,927
పురుషులు: 28,65,211
మహిళలు: 24,83,110
ఇతరులు: 606
పోలింగ్ కేంద్రాలు: 5,042
పోలింగ్ సిబ్బంది : 33,277
సున్నిత, అతిసున్నిత కేంద్రాలు: 1,809
వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్న కేంద్రాలు: 1,717
పంపిణీ చేసిన పోస్టల్ బ్యాలెట్లు: 20వేలు
ఓటుకు వేళాయే..
Published Tue, Apr 29 2014 11:26 PM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
Advertisement