ఎవరి లెక్క వారిదే! | candidates waiting for election counting day | Sakshi
Sakshi News home page

ఎవరి లెక్క వారిదే!

Published Fri, May 2 2014 12:06 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

candidates waiting for election counting day

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ తేదీ వరకు నిరీక్షణ మిగిలింది. మధ్యలో వివిధ పార్టీల అభ్యర్థులు రకరకాల లెక్కల్లో మునిగితేలుతున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ‘ఓటర్లు మాకే మొగ్గు చూపారు.. విజయం మాదే’ అని అన్ని పార్టీల అభ్యర్థులు బయటకు చెబుతున్నా..లోలోపల ఓటమి భయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాము భావించిన వారంతా తమకే ఓటేశారా? వెనుక నడిచినవారు మద్దతిచ్చారా? క్రాస్ ఓటింగ్ కొంపముంచుతుందా? అని తెగ కంగారు పడిపోతున్నారు.  కూడికలు.. తీసివేతలు.

 ఏ బూత్‌లో మైనస్.. ఏ బూత్‌లో ప్లస్ అనే గణాంకాలపై కుస్తీపడుతున్నారు. తమ బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బూత్‌లవారీగా పోలింగ్ వివరాలు తెప్పించుకుని మధిస్తున్నారు. విజయావకాశాలపై బేరీజు వేసుకుంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు రేయిం బవళ్లు విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇప్పుడు ఇళ్లు, గెస్ట్‌హౌస్‌ల్లో కూర్చుని బుధవారం నాటి పోలింగ్ ట్రెండ్‌ను పసిగట్టే పనిలో పడ్డారు. సమీకరణలు మారిపోయి పరిస్థితి ఎక్కడైనా ప్రత్యర్థులకు అనుకూలంగా మారిందా? నమ్మినవారెవరైనా వెన్నుపోటు పొడిచారా? అని ఆరా తీస్తున్నారు.  

 అంతుపట్టని ఓటరు నాడి! మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఓటరు నాడిని అభ్యర్థులు పసిగట్టలేకపోతున్నారు. గతం లో ఎన్నడూ లేనంత కొత్తగా ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారనే ప్రచారం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఆందోళన కలిగిస్తోంది. గెలుపుపై మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గతంగా ఓటమి భయం వెన్నాడుతోంది. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగినందున ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే అని అభ్యర్థులు భావిస్తున్నారు.
 క్రాస్.. చెక్: క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది.

ఏ పార్టీవైపు మొగ్గు చూపాలో తేల్చుకోవడంలో ఓటర్లు చతురతను ప్రదర్శించారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహారశైలిపై ఒక అంచనాకొచ్చిన ఓటర్లలో చాలావరకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. బలమైన ఎంపీ అభ్యర్థి ఉన్నందున.. ఎమ్మెల్యే స్థానాలు కూడా మావేననే విశ్వాసం వ్యక్తం చేయలేని పరిస్థితి అన్ని పార్టీల్లో తలెత్తింది. ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరిగిందనేదానిపైనే అభ్యర్థులు విజయావకాశాలు ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్‌పై బూత్‌లవారీగా ఆరా తీస్తున్నారు.

 ఎంపీ అభ్యర్థులకు పరీక్ష: ఓట ర్ల వ్యవహారశైలి లోక్‌సభ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకే పార్టీకి అటు పార్లమెంటు, అసెంబ్లీలోనూ ఓటేస్తారని ఆశించిన అభ్యర్థులకు ఈసారి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభలో ఒక అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు..  పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మరో పార్టీని ఆదరించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అటు చేవెళ్ల, ఇటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిణామం చోటుచే సుకున్నట్లు స్పష్టమవుతోంది. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి స్పష్టంగా క నిపించింది.

ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసే విషయంలో ఓటర్లు పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో బహుముఖ పోటీ నెలకొనడంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్రాస్ ఓటింగ్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలలో ఒక పార్టీకి మొగ్గు కనిపిస్తున్నా.. పార్లమెంటుకు పడే ఓట్లలో భారీ తేడా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో పోటీచేసిన ఓ ప్రధాన పార్టీకి ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు కూడా వచ్చే సంకేతాలు లేన ప్పటికీ, పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మొగ్గు కనిపించడం విలక్షణంగా పేర్కొంటున్నారు.  
 
 చేవెళ్ల భవితవ్యం.. ఈ ఓటర్లపైనే:
  ఓటింగ్ శాతంపైనా అభ్యర్థులు మేధోమథనం జరుపుతున్నారు. పట్టణ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తగ్గడంపై విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్న పార్టీలు... పెరిగిన ఓటర్ల నేపథ్యంలో అవి ఎవరిని ప్రభావితం చేస్తాయోనని భయపడుతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ధేశించేది శివార్లలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో 49.50 శాతం కాగా, గత ఎన్నికలతో పోలిస్తే 4 శాతం పోలింగ్ తగ్గింది. అలాగే రాజేంద్రనగర్‌లో 2009 ఎన్నికల్లో 60.55 శాతం కాగా, ఈసారి కూడా దాదాపుగా అంతేస్థాయిలో పోలింగ్ జరిగింది. మహేశ్వరంలో గత ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది.  2009లో 60.93 శాతం కాగా, తాజా ఎన్నికల్లో 53.82 శాతం పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో 7,30,386 ఓట్లు పోల్‌కాగా, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో 5,83,526 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గెలుపోటములు ఈ పట్టణ నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు నిర్దేశించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement