వైఎస్ఆర్ సిపి అభ్యర్థి భార్య ఓటు గల్లంతు
అనంతపురం: ఎన్నికల సంఘం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పౌరులు అందరికీ ఓటు హక్కు కల్పించలేకపోతోంది. దరఖాస్తు చేసుకున్న అందరి పేర్లు ఓట్ల జాబితాలో ఉండటంలేదు. జాబితాలో ఉన్న కొందరి పేర్లు తప్పుల తడకగా ఉన్నాయి. కొందరి పేర్లు ఒకరివి, ఫొటోలు మరొకరివి ఉంటున్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో కొందరు ముఖ్యుల ఓట్లు కూడా గల్లంతవుతున్నాయి. మొన్న ఎన్నికల సమయంలో హైదరాబాద్లో హాస్యనటుడు బ్రహ్మానందం కుటుంబానికే ఓట్లు లేవు. బ్రహ్మానందం ఎన్నికల సంఘం తరపున ఓటు విలువ గురించి ప్రచారం చేశారు. ఓటు వేయమని కోరారు. అటువంటి ఆయన పేరు ఓటర్ల జాబితాలో లేదు. ఓట్ల విషయంలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో జరుగుతుంటాయి.
ఈ రోజు ఓ అభ్యర్థి భార్య ఓటు వేయడానికి వెళ్లేసరికే, ఆమె ఓటును వేసేసినట్లు సిబ్బంది చెప్పారు. ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి భార్య కేఎస్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రం వద్దకు ఓటు వేయడానికి వెళ్లారు. అందరితోపాటు వరుసలో నిలబడి లోపలకు వెళ్లారు. అప్పటికే ఆమె ఓటు వేసేసినట్లు ఎన్నికల సిబ్బంది చెప్పారు. దాంతో గుర్నాథ్‌రెడ్డి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ కారణంగా అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. తరువాత అధికారులు వచ్చి ఆమెకు ఓటు వేసే అవకాశం కల్పించారు.
అనంతరం గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ తాము వెళ్లేసరికే తన భార్య ఓటును వేసేనిట్లు చెప్పారన్నారు. తన భార్య ఓటు పోలైపోయినట్లు అక్కడ నోట్ చేసి ఉంది. అయితే నెంబరు 413కు బదులు, 418ని రౌండ్ చేశారని తెలిపారు. అధికారులు వచ్చి ఈ విషయాన్ని గుర్తించి తన భార్యకు ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తొలగించినట్లు ఆయన ఆరోపించారు.