
లడ్డూబాబు లడాయి
ఎన్.శ్రీనివాస్/తాడేపల్లిగూడెం: లడ్డూబాబు సినిమాలో ప్రధాన క్యారెక్టర్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చాలా దగ్గర పోలికలున్నాయట. ఇదే విషయం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. లడ్డూబాబు సినిమాలో హీరో దోమకాటు వల్ల 280 కిలోల బరువు పెరుగుతాడు. లక్ష్యం సాధించేందుకు అష్టకష్టాలు పడతాడు. అధికారం కోసం అడ్డదారులు తొక్కే చంద్రబాబు జనామోదం లేక బక్కచిక్కిన తన పార్టీకి గాలి కొట్టించుకుని సీమాంధ్రతోపాటు తెలంగాణలోనూ ఎంతో బలంగా ఉన్నట్టు లడ్డూబాబులా కలరింగ్ ఇస్తున్నారట. లేనిది ఉన్నట్టుగా కనికట్టు చేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన వెన్నంటి ఉండే పచ్చ పత్రిక, తోక పత్రిక, ఎల్లో ఛానళ్ల సహాయంతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయించుకోవడం.. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఆ గాలి తుస్సుమని బొక్కా బోర్లాపడటం అలవాటైపోరుుందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. 2003 సంవత్సరాంతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు పేలుడులో గాయపడిన చంద్రబాబు ఆ సానుభూతిని ఓట్ల రూపంలో క్యాష్ చేసుకునేందుకు ముందస్తుగానే అసెంబ్లీని రద్దు చేసిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల సమయంలో పచ్చపత్రిక బాబుపై సానుభూతి వెల్లివిరుస్తోందంటూ అనేక కథనాలను వండి వార్చింది. మరోసారి టీడీపీదే విజయమంటూ ఘంటాపథంగా చెప్పుకొచ్చింది. బక్కచిక్కిన బాబు పార్టీ బలోపేతమైందంటూ బూస్టింగ్ ఇచ్చింది. ప్రజలను ఏమార్చేం దుకు ప్రయత్నించింది. ఆ ప్రచారంలో నిజం లేదని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనను చరమగీతం పాడారు.
2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్ర బాబు ఎల్లో మీడియాతో కలిసి భారీ పన్నాగమే పన్నారు. ఆరు నెలల ముందు నుంచీ వైఎస్ కుటుంబంపైన.. అప్పటి ప్రభుత్వ విధానాలపైన బురద చల్లుతూ పచ్చ పత్రిక, తోక పత్రికలు కథనాలను వండివార్చాయి. అయినా ప్రజల్లో వైఎస్‌కు జనాదరణ ఏ మాత్రం తగ్గలేదని సర్వేలు స్పష్టం చేయడంతో టీఆర్‌ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేశారు. తద్వారా టీడీపీ బలం నాలుగు రెట్లు అయ్యిందని, వైఎస్ ఆధ్వర్యంలోని మంత్రులకు కనీసం డిపాజిట్లు కూడా రావంటూ తమ వర్గం మీడియాతో విస్తృతంగా ప్రచారం చేయించారు. పచ్చ పత్రిక అయితే వైఎస్‌పై విషం చిమ్మింది. ఆ ఎన్నికల్లో వైఎస్ చరిష్మాలో మహాకుటమి కొట్టుకుపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి అదే పంథాను అనుసరిస్తున్నారని.. ఇదే తమ పార్టీని దెబ్బతీస్తోందని తమ్ముళ్లు వాపోతున్నారు. రాష్ట్ర విభజనతో చెల్లని కాసులుగా మిగిలిన కాంగ్రెస్ నాయకులతో ప్యాకేజీలు మాట్లాడుకుని పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు లడ్డూబాబు తరహాలో లడాయి చేశారని గుర్తు చేస్తున్నారు. కమలంతో కాళ్లబేరానికి వెళ్లి మరీ పొత్తు కుదుర్చుకున్న బాబు తన వర్గం మీడియాతో టీడీపీ ఎంతో బలంగా ఉండటం వల్లే ఇతర పార్టీల నుంచి నేతలు క్యూ కడుతున్నారంటూ ప్రచారాన్ని హోరెత్తిం చారు. పనిలో పనిగా పార్టీలోకి వచ్చిన నేతలతో వైఎస్ కుటుంబంపై విమర్శల వర్షం కురిపించారు. ఎల్లో మీడియా అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విష ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చింది. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి అసలు విషయం ప్రజలకు తెలిసిపోవడంతో మళ్లీ పాత సీనే రిపీటవుతోందని తమ్ముళ్లు బహిరంగంగానే చెబుతున్నారు. ఫ్యాన్ హోరులో లడ్డూబాబు కొట్టుకుపోవడం ఖాయమంటున్నారు.