
'నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయతే'
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా తాను విశ్వసనీయ లేని రాజకీయాలు చేయలేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులా తాను విశ్వసనీయ లేని రాజకీయాలు చేయలేనని వైఎస్సార్ సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారం కోసం చంద్రబాబు దొంగ హామీలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల ఇళ్లు ఉంటే ప్రతీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని బూటకపు హామీలిస్తున్న ఆయన్ను ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజలకు సూచించారు. జిల్లాలోని వింజుమూరు సభకు హాజరైన జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.ప్రజలకు వద్దకు ఏరోజూ వెళ్లని బాబుకు వారి కష్టాలు ఎలా తెలుస్తాయని జగన్ నిలదీశారు. ఆయన పాలనలో విశ్వసనీయతకు అర్ధం తెలియని రోజులను చూసామన్నారు. ఈ ఎన్నికల్లో సాధ్యం కాని హామీలను ఇస్తున్న చంద్రబాబు.. ఆనాటి తొమ్మిది ఏళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు.
ఆయన మాదిరి అబద్దాలు ఆడటం తనకు చేతకాదని.. తనకు తెలిసిందల్లా విశ్వసనీయతేనని జగన్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రమాణస్వీకారం రోజునే ఐదు సంతకాలు చేస్తానన్నారు. అక్కచెల్లెమ్మల కోసం అమ్మఒడి పథకం ఫైలుపై మొదటి సంతకం చేస్తానని, అవ్వాతాతల పెన్షన్ రూ.200 నుంచి 700 చేస్తూ రెండో సంతకం, రైతన్నలకు అండగా ఉండేందుకు రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిపై మూడో సంతకం, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తూ నాల్గో సంతకం చేయడమే కాకుండా, అన్ని రకాల కార్డుల జారీ చేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఐదో సంతకం చేస్తానని తెలిపారు. ఈ ఐదు సంతకాలతో రాష్ట్ర దిశా-దశను మార్చుకుందామని జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించుకుని బంగారు భవితను నిర్మించుకుందామని ప్రజలకు విజ్క్షప్తి చేశారు.