* ఎన్నికలను ఖరీదైన వ్యవహారంగా మార్చేసిన బాబు
* ఎన్నికల్లో భారీ ఖర్చుకు తెర తీసిన ఘనుడు
యాచమనేని పార్థసారథి: అది 1994. ఎన్నికల వేళ. ఆర్థిక బలం పెద్దగా లేని కొందరు అభ్యర్థులకు బీ ఫారాలతో పాటు కొంత నగదు సాయం కూడా చేశారు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సంపర (ఇప్పుడు రద్దయింది) అసెంబ్లీ స్థానం అభ్యర్థి టి.సత్యలింగ నాయకర్‌కు రూ.5 లక్షలిచ్చారు. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ గెలిచింది. ఎన్నికల హడావిడి సద్దుమణిగాక నాయకర్ సుమారు రూ.2 లక్షలను ఒక కవర్‌లో పెట్టి భద్రంగా తీసుకొచ్చి ఎన్టీఆర్‌కు తిరిగిచ్చారు. ఆయన ఆశ్చర్యపోతూ, ‘బ్రదర్ ఏమిటిది?’ అని ప్రశ్నించారు. ‘మీరు నాకు ఇచ్చిన ఎన్నికల విరాళంలో ఖర్చు పెట్టగా మిగిలిన మొత్తం. పార్టీ ఖర్చులకు వినియోగించండి’ అన్నారాయన. అందుకు ఎన్టీఆర్ ఎంతో సంతోషించారు. ఓకే బ్రదర్ అంటూ భుజం తట్టి పంపించారు. ఇక్కడ కట్ చేస్తే...
అది 2006. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎన్నికల వేళ. టీడీపీ తరఫున ఎన్నికల పర్యవేక్షణకు హైదరాబాద్ నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన మాజీ మంత్రి ఒకరిని అధ్యక్షుడు చంద్రబాబు అక్కడికి పంపారు. ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే అప్పుడు కూడా అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను ఆ పరిశీలకుడితోనే పంపించారు. ఎన్నికలు ముగిశాక సదరు పరిశీలకుడు తిరిగొచ్చారు. ఓటింగ్ సరళి, పార్టీ నేతల పనితీరు నివేదికతో పాటు అభ్యర్థుల ఖర్చుల కోసం తనతో పంపిన మొత్తంలో మిగిలిన డబ్బును బాబుకు తిరిగిచ్చారు. అంతే! తోక తొక్కిన తాచులా లేచారు బాబు. సదరు నేతపై ఆగ్రహోదగ్రుడయ్యారు.
‘‘ఇంత సీనియర్ నాయకులైన మీకు ఎన్నికలను ఎలా మేనేజ్ కూడా చేయాలో తెలియకపోతే ఏమనాలి! మీకు అంత డబ్బులిచ్చింది ఎందుకు? ఖర్చు చేయకుండా మిగుల్చుకొని తేవడానికా? ఇలా నాకు తిరిగిస్తే ఏం ప్రయోజనం? ఆ డబ్బును కూడా ఖర్చు చేస్తే మనకు మరో రెండు మూడు కార్పొరేటర్ సీట్లొచ్చేవి కదా!’’ అంటూ మండిపడ్డారు. ఎన్నికలను చంద్రబాబు ఏ మేరకు డబ్బుమయం చేశారనేందుకు చిన్న ఉదాహరణగా రాజకీయ వర్గాల్లో ఈ ఉదంతాన్ని చెబుతూ ఉంటారు.
బాబుతోనే ఎన్నికలు డబ్బు మయం
రాష్ట్రంలో ఎన్నికలు ఇంతగా డబ్బుమయంగా మారాయంటే అది చంద్రబాబు పుణ్యమేనని రాజకీయ వర్గాల్లో విసృ్తత ప్రచారం. రాజకీయ ఎదుగుదలకు ఆయన ఎంచుకున్న దొడ్డిదారి మార్గం కూడా అందుకు కొంతవరకు కారణమైందని చెబుతుంటారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను వెన్నుపోటుతో గద్దె దింపి అందలమెక్కిన బాబు... పార్టీలోనూ, బయటా ఎన్టీఆర్ పేరే వినిపించకూడదు, ఎవరూ ఆయన నామస్మరణ చేయరాదు అన్న ఉద్దేశంతో, వీలైనంతగా తన పేరే ప్రచారంలో ఉండాలనే యావతో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్ల డం మొదలుపెట్టారు. బాబు సీఎంగా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఓటర్ల చేతిలో రూ.500 కొత్త నోట్లు పెళపెళమన్న సందర్భం అదే! అప్పటిదాకా ఓట్ల కోసం అంత పెద్ద మొత్తాన్ని ఏ రాజకీయ పార్టీ కూ డా ఓటర్లకు పంచిన దాఖలాలు లేనే లేవని ఆ ఎన్నికను నిశితంగా గమనించిన పలువురు విశ్లేషించారు. మరీ ఇంత భారీగా ఓటర్లకు 500 రూ పాయల నోట్లు పంచుతున్నదెవరా అని ఆరా తీస్తే.. అది బాబు ఘనతేనని తేలిందంటారు. అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ ఉదంతం అనివార్యంగా ప్రస్తావనకు వస్తుంది. దీని గురించి తెలిసిన వారంతా, ‘రాష్ట్రంలో ఓటర్లకు పెద్ద గాంధీని పరిచయం చేసింది చంద్రబాబే’ అని చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద గాంధీ అంటే రూ.500 నోటన్నమాట. ఎందుకంటే అప్పట్లో అదే పెద్ద నోటు. రూ.1,000 నోటు ఇంకా రాలేదు. బాబు జమానాకు ముందు వరకూ ఏ పార్టీ అయినా మహా అయితే 5 నుంచి 10 లక్షల్లో ఎన్నికల తంతు పూర్తి చేసేదని 1990వ దశకంలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని ఎవరిని అడిగినా చెబుతారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు లెక్కాపత్రం లేకుండా అడ్డగోలుగా పెరిగింది 1995 తర్వాతేనని పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా అంగీకరిస్తారు. ప్రతి నియోజకవర్గానికీ పెద్ద సంఖ్యలో నేతలను ఇన్‌చార్జిలుగా నియమించటం, వారికి లక్ష్యాలను నిర్దేశించటం, వాటి సాధనకు ఎలాంటి వనరులు కావాలన్నా క్షణాల మీద సమకూర్చడం... ఇదీ బాబు మార్కు ఎలక్షన్ మేనేజ్‌మెంట్. కొత్తగా పార్టీ పగ్గాలను చేపట్టడం, తాను పేరున్న నాయకుడు కాకపోవడం, పైగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడన్న మచ్చ ఉండడం... ఏ చిన్న ఎన్నికలో ఓడినా, తన నాయకత్వ లేమి బయట పడుతుందనే భయం... వెరసి విచ్చలవిడి ఖర్చుకు బాబు శ్రీకారం చుట్టారని విశ్లేషకులు అంటుంటారు.
కోట్లు కొట్టినోళ్లకే టికెట్లు...
సీమాంధ్రలో పార్టీకి భవిష్యత్తు లేనట్టేనని నిర్ధారణకు వచ్చిన టీడీపీ నాయకత్వం... భారీగా ముట్టజెప్పిన వారికే టికెట్లు కట్టబెట్టిందని సర్వత్రా వినిపిస్తోంది. చాలా టికెట్లకు 5 నుంచి 25 కోట్ల రూపాయల దాకా బాబు కోటరీ వసూలు చేసిందని సమాచారం. నిజానికి ఇలాంటి వారికి టికెట్లను కేటాయించడానికే... పలు స్థానాల్లో అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేసే చివరి రోజు దాకా ఖరారు చేయకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేశారన్న ప్రచారమూ ఉంది. టీడీపీలో జోరుగా సాగిన టికెట్ల అమ్మకాలను వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి స్వయంగా బయట పెట్టారు. డబ్బు లేదన్న కారణంతోనే తనకు టికెట్ నిరాకరించారన్నారు. టికెటిస్తే భార్యాబిడ్డల కిడ్నీలు అమ్ముకునైనా ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేస్తానని లింగారెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. కానీ ఆ టికెట్‌ను వరదరాజులరెడ్డికి రూ.25 కోట్లకు టీడీపీ ఉపాధ్యక్షుడు సీఎం రమేశ్ అమ్ముకున్నారని మీడియా ముందు లింగారెడ్డి వెల్లడించారు.
ఇలాగే విజయనగరం అసెంబ్లీ టికెట్‌ను రూ.5 కోట్లు చెల్లించి మీసాల గీత దక్కించుకున్నారనే ఆరోపణలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోక్‌సభ సీటును కూడా ఇలాగే డబ్బు సంచులకు అమ్ముకున్నారన్న ఆరోపణలున్నాయి. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులవర్తి రామాంజనేయులు ఆ కోవలోనే ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలకొల్లు సీటుకు కూడా భారీ రేటు పలికింది. నర్సాపురం, ఉంగుటూరు టికెట్లు దక్కించుకున్న వారు కూడా భారీగానే సమర్పించుకున్నామని అభ్యర్థులే సన్నిహితుల ముందు చెబుతున్నారు.
కృష్ణా జిల్లాలో నందమూరి హరికృష్ణ పోటీ చేయాలని ఆసక్తి చూపిన స్థానమైతే ఏకంగా రూ.5 కోట్లు పలికిందని జిల్లాలో బలంగా వినిపిస్తోంది. అవనిగడ్డ టికెట్ ఆశించిన మాజీ మంత్రి ఒకరు రూ.2 కోట్లు చెల్లించారని జిల్లాలో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇక నూజివీడు టీడీపీ టికెట్‌ను కాంగ్రెస్ నేత ఒకరు 3 కోట్లు చెల్లించి దక్కించుకున్నారని జిల్లా పార్టీ నేతలు చెబుతున్నారు.
విజయవాడ తూర్పు సీటును తాజాగా కాంగ్రెస్ నుంచి చేరిన సిటింగ్ ఎమ్మెల్యే ఆశించారు. రూ.3 కోట్లిస్తే టికెటిస్తామని బాబు కోటరీ బేరం పెట్టింది. అంత ఇచ్చుకోవటం తన వల్ల కాదనడంతో కనీసం కోటి అయినా ఇవ్వండంటూ కూరగాయల బేరానికి దిగింది. ఆ మాత్రం కూడా వల్ల కాదంటూ ఆయన చేతులెత్తేయటంతో చివరకు ఆ సీటు కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఓ మాజీ ఎమ్మెల్యేకు రూ.కోటిన్నర తీసుకుని కట్టబెట్టారని విజయవాడలో బలంగా వినిపిస్తోంది.
గుంటూరు (తూర్పు) టికెట్ కేటాయింపులో టీడీపీ జిల్లా పార్టీ పరిశీలకుడే కీలక పాత్ర పోషించారంటున్నారు. 3-5 కోట్ల మధ్య చెల్లింపులు జరిగినట్టు సమాచారం. ఇక నరసరావుపేట స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. దాన్ని యడ్లపాటి రఘునాథబాబుకు కేటాయించగా ఆయన బలహీన అభ్యర్థంటూ బాబు కోటరీ నానా యాగీ చేసింది. చివరికి ఆ టికెట్‌ను తమ సన్నిహితుడైన తిరుమల డెయిరీ డెరైక్టర్ నల్లమోతు వెంకట్రావుకు ఇప్పించుకుంది. ఈ డీల్‌లో టీడీపీ పెద్దల మధ్య కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు బీజేపీ శ్రేణులు వాపోతున్నాయి.
అలాగే మాచర్ల, ప్రత్తిపాడు టికెట్లకూ భారీ మొత్తాలు చేతులు మారాయి. అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ నుంచి చేరిన సీనియర్ నేత కూడా టికెట్ కోసం భారీగానే ముట్టజెప్పినట్టు బలంగా వినిపిస్తోంది. అసలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్ల పరిశీలన పేరుతో కూడా టీడీపీ పెద్దలు లక్షల్లో గుంజారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
కోట్లు... కోటరీ
అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నేర్చుకున్న ‘ఎలక్షన్ మేనేజ్‌మెంట్’ సూత్రాన్నే ప్రతిసారీ అమలు చేస్తుంటారు చంద్రబాబు. ఈసారి కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ అభ్యర్థికైతే కనీసం 6 నుంచి 10 కోట్లు, లోక్‌సభ అభ్యర్థయితే హీన పక్షం రూ.30 కోట్ల పైచిలుకే ఖర్చు పెట్టాలని బాబు చెబుతున్నట్టు బలంగా వినిపిస్తోంది. నామినేషన్ల దాఖలు వేళ బాబు హడావుడిగా టీడీపీలో చేర్చుకున్న వారిలో అత్యధికులు ఇలా కోట్లు వెదజల్లగలవారే! కొన్నేళ్లుగా బాబు కోటరీలోని పారిశ్రామికవేత్తలే టీడీపీ తాలూకు డబ్బు లావాదేవీలన్నింటినీ నిర్వహిస్తున్నారు. పైగా ఏరికోరి వారినే బాబు ఆయా జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జిలుగా కూడా నియమించారు!
కట్టలు తెంచిన కరెన్సీ బాబు
Published Mon, Apr 28 2014 2:34 AM | Last Updated on Tue, Aug 14 2018 5:51 PM
Advertisement
Advertisement