తాళ్లూరు, న్యూస్‌లైన్ : దారి విషయంలో తలెత్తిన వివాదం ఇరువర్గాల ఘర్షణకు దారి తీయడంతో 14 మంది గాయపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ సంఘటన మండలంలోని విఠలాపురంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. విఠలాపురం- రమణాలవారిపాలెం రోడ్డు అడ్డదారి యానాది బజారులో ఉన్న దిబ్బ విషయమై కొంతకాలంగా ఇరువార్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకోవాలని గ్రామస్తులు కొందరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా దిబ్బలను తొలగించాలని వాటి యజమానులైన కురిచేటి పిచ్చయ్య, ఆయన తమ్ముళ్లను కోరారు. తమకు ఒకరోజు సమయమిస్తే తొలగిస్తామని వారు చెప్పారు.
ఇంతలో అంతర్గత రోడ్లకు మట్టి తోలుకుంటున్నారని గ్రామంలోని కొందరు స్థానిక కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సురేష్ వచ్చి ఎన్నికల సమయంలో మట్టి తోలుకోవద్దని గ్రామస్తులతో చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, రోడ్లపైనే దిబ్బలు ఉన్నా ఎందుకు తొలగించలేదని కొందరు మహిళలు కార్యదర్శిని ప్రశ్నించారు. రోడ్ల వెంబడి దిబ్బల తొలగింపునకు చర్యలు తీసుకుంటానని కార్యదర్శి హామీ ఇచ్చారు. ఇంతలో వివాదం చెలరేగి ఇరువర్గాలూ దాడికి దిగాయి. క్షణాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాడిలో ఇరువర్గాలకు చెందిన 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు తాళ్లూరు, దర్శి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సై శ్రీహరిరావు తన సిబ్బందితో అక్కడికి వచ్చి గ్రామంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ సీపీ నాయకులపై పోలీసు జులుం
విషయం తెలుసుకునేందుకు వచ్చిన విఠలాపురం కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు వెంకటేశ్వరరెడ్డిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. గ్రామ నాయకుడు పాలెం సుబ్బారెడ్డి, కొందరు మహిళల పట్ల ఖాకీలు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల తీరును వైఎస్సార్ సీపీ నాయకులు ఖండించారు.
విఠలాపురంలో ఇరువర్గాల ఘర్షణ
Published Tue, Apr 1 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM
Advertisement
Advertisement