సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని పురపాలక సమర క్షేత్రాల్లో అసలు సిసలు పోరు షురువైంది. కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం నాటికి ముగియడంతో ఇక ప్రత్యక్ష యుద్ధమే మిగిలింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయడంతో అభ్యర్థులందరికీ తమ ప్రత్యర్థులెవరనే దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. పార్టీ బీ-ఫారం సొంతం చేసుకున్న అభ్యర్థులు ఉత్సాహంగా ఎన్నికల బరిలోకి దూకగా, టికెట్ ఆశించి భంగపడిన పలువురు రెబల్‌గా రంగంలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులకే సవాలు విసుతున్నారు. టికెట్ రాక అలకబూనిన తమ నేతలను బుజ్జగించే పనిలో ఆయా పార్టీల అధిష్టానాలు బిజీగా ఉన్నాయి. అవకాశం రాలేదన్న అసంతృప్తితో ఉన్న నాయకులకు ప్రత్యర్థి పార్టీలు గాలం వేస్తుండడంతో ఫిరాయింపులు జోరందుకున్నాయి.
తుది పోరులో తమ ప్రత్యర్థులెవరనేది తేలిపోవడంతో అభ్యర్థులు విజయం కోసం ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ప్రత్యర్థులను చిత్తుచేసే ఎత్తుగడలలో భాగంగా అవతలి పార్టీలలో అసంతృంప్తులను ప్రోత్సహిస్తున్నారు. వారిని రెబల్స్‌గా బరిలో నిలిపి ఉంచి తమ విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల రెబల్ క్యాండెట్‌లకు భారీ నజరానాలు ఆశచూపుతున్నారు. టికెట్ రాక నిరాశకు గురైన వారి పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని పార్టీల్లో ఒకే కుటుంబంలో నలుగురైదుగురు టికెట్లు పొంది జాక్‌పాట్ కొట్టారు. మరి కొన్ని స్థానాల్లో ఒకే కుటుంబం ఇద్దరు, ముగ్గురు బీ-ఫారాలు పొంది బరిలో నిలిచారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల్లో టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడ్డవారు అధినేతలపై తిట్లదండకానికి దిగగా మరి కొందరు ఇండిపెండెంట్లుగా బరిలో దిగి పోరులో నిలిచారు. అన్ని పార్టీల కన్నా కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద అధికంగా ఉంది.
ఇక క్షేత్రంలోకి!
Published Tue, Mar 18 2014 11:43 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement