పొసగని పొత్తు | Congress and BJP trying to tie in karimnagar district | Sakshi
Sakshi News home page

పొసగని పొత్తు

Published Fri, Apr 25 2014 3:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

Congress and BJP trying to tie in karimnagar district

మిత్రపక్షాలు.. పొత్తులోనే కత్తులు నూరుకుంటున్నాయి. జిల్లాలో రెండు పార్టీల సఖ్యత ఎండమావిలా కనిపిస్తోంది. దీంతో ఇరుపక్షాల ఓట్ల బదిలీ ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్‌ను ఎదిరించేందుకు భావ సారూప్యమున్న పార్టీలుగా తాము పొత్తు కూడినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ... క్షేత్ర స్థాయిలో ఆ రెండు పార్టీలకు చుక్కెదురవుతోంది. బీజేపీ పోటీ చేస్తున్న చోట టీడీపీ శ్రేణులు దూరంగా ఉంటున్నాయి. టీడీపీ పోటీ చేసే చోట బీజేపీ నేతలు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని అత్యధిక నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ గల్లంతవటంతో.. వాళ్లు ఉన్నా లేనట్లుగానే ఉందని బీజేపీ అభ్యర్థులు ఒంటరిగానే తండ్లాడుతున్నారు. మరోవైపు తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసుకున్న టీడీపీ కలిసొస్తే.. తమకు నష్టం తప్ప లాభమేముందని కొందరు అభ్యర్థులు సేఫ్‌సైడ్‌గా వాళ్ల ను తప్పించుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లాలో ఈసారి బీజేపీ అత్యధిక స్థానా లు పంచుకుంది. కానీ.. నామినేషన్ల పర్వంలో అభ్యర్థి తొందరపాటుతో బీజేపీ హుస్నాబాద్ సీటును కోల్పోయింది.
 
 దీంతో అక్కడ రెండు పార్టీలు పోటీకి దూరమయ్యాయి. చెరి సమంగా జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మిత్రపక్షాల అభ్యర్థులు పోటీలో నిలిచారు. కరీంనగర్ ఎంపీ సీటును బీజేపీ.. పెద్దపల్లి ఎంపీ సీటును టీడీపీ సర్దుబాటు చేసుకుంది. కానీ.. కొన్ని సెగ్మెంట్లలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి సిహెచ్.విద్యాసాగర్‌రావు ప్రచారం హోరెత్తిస్తున్నప్పటికీ.. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి డాక్టర్ శరత్ ప్రచారంలో కనిపించటం లేదు. రెండు పార్టీల శ్రేణులు సైతం తమ అభ్యర్థిని వెతుక్కొని పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొంది. మిత్రుల విజయావకాశాలపై నీళ్లు జల్లుతోంది.
 
 హుస్నాబాద్‌లో మిత్రపక్షాలు పోటీకి దూరమయ్యాయి. నామినేషన్ల దాఖలు సమయంలో చేసిన పొరపాటుతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఎంపీ అభ్యర్థి చిక్కుల్లో పడ్డారు. సొంత అభ్యర్థి బరిలో లేకపోవటం, టీడీపీ శ్రేణులు సహకరించకపోవటంతో ఒంటరిగానే ప్రచారం చేస్తున్నారు. టిక్కెట్టు ఆశించి భంగపడి.. అసంతృప్తిగా ఉన్న టీడీపీ పార్టీ ఇన్‌చార్జి పేర్యాల రవీందర్‌రావు సైతం అంటీముట్టనట్లుగా ఉన్నారు.
 హజూరాబాద్‌లో మిత్రపక్షాల పొత్తు బెడిసికొట్టింది. రెండు పార్టీలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి కశ్యప్‌రెడ్డికి.. స్థానిక బీజేపీ నాయకులు సహకరించటం లేదు. కేవలం ఎంపీ అభ్యర్థి పక్షాన తమవంతుగా ప్రచారం చేసి చేతులు దులుపుకుంటున్నారు.
 
 వేములవాలో బీజేపీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ సొంత కేడర్‌ను నమ్ముకుంటున్నారు. అక్కడ టీడీపీ ఇన్‌చార్జి చెన్నాడి సుధాకర్‌రావు ఏకంగా పార్టీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీ టిక్కెట్టు ఆశించిన గండ్ర నళినికి సీట్ల సర్దుబాటు షాక్‌కు గురి చేయటంతో.. నైరాశ్యంతో ఆమె నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
 
 పెద్దపల్లి టిక్కెట్టు ఆశించిన బీజేపీ నాయకుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి  రామగుండం నుంచి పోటీకి దిగారు. దీంతో ఇక్కడున్న కమలం క్యాడర్ కాస్తా  రామగుండం వలస పోయింది. ఫలితంగా పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు విజయరమణారావు ఒంటరయ్యారు.
 
 ధర్మపురిలో బీజేపీ అభ్యర్థి కన్నం అంజయ్య ప్రచార పర్వంలో టీడీపీ కేడర్ వెతికినా కనిపించటం లేదు. అక్కడ టీడీపీలో ఉన్న ముఖ్య నేతలందరూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దెల రవీందర్ సైతం దూర దూరంగానే ఉన్నారు.
 
 మంథని నియోజకవర్గంలో బీజేపీ ప్రాబల్యం తక్కువే. కానీ..  ముఖ్య నాయకులు సైతం టీడీపీ అభ్యర్థి కర్రు నాగయ్య తమను కలుపుకోవటం లేదు. ఆ పార్టీ సీనియర్ నాయకుడు సత్యప్రకాశ్, సెగ్మెంట్ ఇన్‌ఛార్జీ బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
 
 కోరుట్ల నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య సఖ్యత లేదు. మూడు రోజుల కిందటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు శికారి విశ్వనాథం కాంగ్రెస్‌లో చేరాడు. బీజేపీ అభ్యర్థి సురభి భూంరావు సొంత కేడర్‌తోనే ప్రచారం సాగిస్తున్నారు. టీడీపీ వాళ్లు వస్తే అది తమకు వ్యతిరేకతే తప్ప కలిసొచ్చేదేమీ లేదని దూర దూరంగా ఉంటున్నారు.
 
 సిరిసిల్లలో టీడీపీ కేడర్ గల్లంతయింది. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌ఆర్‌ఐ పుట్ట కిశోర్ ఈసారి తనకు టిక్కెట్ట్టు దక్కకపోవటంతో అక్కణ్నుంచి అదృశ్యమయ్యాడు. ఆయనతో పాటు పార్టీ టిక్కెట్లు ఆశించిన  రెడ్డవేణి గోపి, కోడి అంతయ్య స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. దీంతో టీడీపీ బలగం ఖాళీ అయింది.
  ఫలితంగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ సొంత పార్టీ కేడర్‌ను నమ్ముకుంటున్నారు.
 
 మానకొండూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు పోటీగా.. ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచిన బీజేపీ ఇన్‌చార్జి గడ్డం నాగరాజు పంతం వదిలిపెట్టారు. ఇద్దరూ కలిసిపోయారు. కానీ.. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య సమన్వయ లోపంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. రెండ్రోజుల కిందట నుస్తులాపూర్‌లో ఎంపీ విద్యాసాగర్‌రావు ప్రచారానికి టీడీపీ వాళ్లు దూరంగా ఉన్నారు.
 
 చొప్పదండిలో ఎంపీ విద్యాసాగర్‌రావు ప్రచారానికి వచ్చిన సందర్భంలో కలిసి తిరుగుతున్న బీజేపీ కేడర్.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యంతో అంతంత  మాత్రంగానే కలిసి మెదులుతున్నారు.
 
 రామగుండం నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా చీలిపోయింది. ఒక వర్గం బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తుండగా.. మరో వర్గం దూరంగా ఉంది. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌కే అఫ్జల్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర పార్టీ నాయకుడు ఆర్.కేశవరెడ్డి వర్గీయులు బీజేపీతో కలిసి తిరుగుతున్నారు.
 
 కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులందరూ టీఆర్‌ఎస్‌లోకి వలసవెళ్లారు. దీంతో ఇక్కడ పార్టీని నడిపించే నాయకులే కాదు.. జెండా మోసేందుకు కార్యకర్తలు కూడా కరువయ్యారు. చాలా రోజులుగా నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు సైతం ఖాళీగా ఉంటోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. మిత్రపక్షం పూర్తిగా దివాళా తీయడంతో బీజేపీ నాయకులు ఒంటరి పోరునే నమ్ముకుని ముందుకెళ్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement