టీడీపీలో ఆరని జ్వాల | BJP announces alliance with Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీలో ఆరని జ్వాల

Published Wed, Apr 9 2014 2:17 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

BJP announces alliance with Chandrababu Naidu

 నరసన్నపేట, న్యూస్‌లైన్: నరసన్నపేట టీడీపీ గుండెల్లో పొత్తుల కత్తి దిగింది. అసమ్మతి లావాను ఎగజిమ్ముతోంది. ఈ విషయంలో పార్టీ అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ తమను కాదనుకుంటే.. తామూ పార్టీకి నీళ్లొదులుతామని స్పష్టం చేస్తోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గంలో టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సుమారు 15 ఏళ్లుగా అధికారం లేక నాయకత్వ లోపం కూడా ఏర్పడింది. ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన మరణానంతరం పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. పలువురు నాయకులు పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లో చేరిపోయారు.
 
 ఆ తర్వాత పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న సీనియర్ నేత బగ్గు లక్ష్మణరావు కూడా పార్టీని వీడిపోవడంతో నాయకత్వ లోపం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో పార్టీ ఇన్‌చార్జిగా నియమితులైన బగ్గు రమణమూర్తి పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ ఎర్రన్నాయుడు అనుచరుని గా గుర్తింపు పొందిన ఆయన గతంలో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి పలుమార్లు భంగపడ్డారు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న కృత నిశ్చయంతో గత ఆరు నెలలుగా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. గ్రామా ల్లో విస్తృతంగా పర్యటించి నిస్తేజంగా ఉన్న కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
 
 కష్టపడితే నియోజకవర్గంలో పార్టీ బలం పెంచవచ్చనే విశ్వాసం వారిలో కల్పించారు. కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ క్యాడర్‌ను తిరిగి రప్పించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. దాంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతూ బలంగా ఉన్న వైఎస్‌ఆర్‌సీపీతో పోటీకి గట్టిగా నిలబడగలమన్న నమ్మకం ఏర్పడుతు న్న తరుణంలో పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న పొత్తుల నిర్ణయంతో స్థానిక నాయకులు హతాశులయ్యారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులను కలిసి పొత్తు జాబితా నుంచి నరసన్నపేటను తొల గించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎంపీ స్థానానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయనిహెచ్చరించారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు కింజరాపు ధ్వయం అధినేత చంద్రబాబుతో మాట్లాడారు. నరసన్నపేట బదులు పాతపట్నాన్ని బీజేపీకి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపించడం లేదు.
 
 పార్టీనే వదులుకుంటాం
 తమ వ్యతిరేకతను, అసంతృప్తిని అధిష్టానం పట్టించుకోకుపోతే.. నరసన్నపేటను కమలానికే కట్టబెడితే ఏం చేయాలని టీడీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు నిరసన కార్యక్రమాలతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే అదృష్టం కలిసివచ్చి ఇటీవలే ఏకగ్రీవంగా అందివచ్చిన నరసన్నపేట జెడ్పీటీసీతోపాటు, మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి రాజీనామాలు చేసైనా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలని నాయకులకు కార్యకర్తలు సూచిస్తున్నారు. అధిష్టానం తీరు, నిర్ణయం మారకపోతే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకే కాదు.. ఎంపీ ఓట్లు కూడా టీడీపీకి పడకుండా చేస్తామని అంటున్నారు. కాగా ఇటీవల ధర్మాన ప్రసాదరావుతో పాటు వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లి.. ఆ తర్వాత మళ్లీ టీడీపీలోకి తిరిగి వచ్చిన కార్యకర్తలు, నాయకుల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా తయారైంది. ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీలో ఉండలేక.. అలాగని వైఎస్‌ఆర్‌సీపీలోకి తిరిగి రాలేక సతమతమవున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement