
10 వేల కోట్ల ఖర్చుపై దర్యాప్తునకు రెడీ
నరేంద్ర మోడీ సవాల్
దర్యాప్తుపై ఈసీకి నేనే లేఖ రాస్తా
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారానికి తాను రూ.10 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు, అందులో 90 శాతం నల్లధనమేనని కాంగ్రెస్ నేతలు ఆనంద్ శర్మ తదితరులు చేసిన ఆరోపణలపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ స్పందించారు. వీటిపై ఏ ప్రభుత్వ సంస్థతో దర్యాప్తుకైనా తాను సిద్ధమేనని సవాల్ విసిరారు. దీనిపై తానే స్వయంగా ఎన్నికల సంఘానికి(ఈసీ) లేఖ రాస్తానని ‘ఇండియా టీవీ’ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘యూపీఏ ప్రభుత్వానికి ఇంకా 30, 40 రోజులు మిగిలి ఉన్నాయి. దర్యాప్తు కోసం అది అన్ని శక్తులను వాడుకోవాలి. దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలి. పదివేల కోట్లు చాలా పెద్ద మొత్తం. ఆ డబ్బెవరిదో, ఎక్కణ్నుంచి వచ్చిందో, ఎక్కడ ఖర్చు చేశారో వాళ్లు అడగాలి. నిజమేంటో దేశానికి చెబితే సంతోషిస్తా. ఆరోపణలకు ఆధారం లభిస్తే ఈసీ కూడా దర్యాప్తు జరపాలని శర్మ దానికి లేఖ రాయాలి.
ఎన్నికల కోడ్ వల్ల దర్యాప్తునకు ఆదేశించలేకపోతే, దర్యాప్తుపై నాకు ఏ అభ్యంతరమూ లేదని నేనే ఈసీకి లేఖ రాస్తా’ అని అన్నారు. తాను గుజరాత్ రైతుల భూములను కారుచవగ్గా పారిశ్రామిక సంస్థలకు కట్టాబెట్టానంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపణలు అబద్ధాలని, వాటి వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయన్నారు. రాహుల్ టాటాల నానో కార్ల ప్రాజెక్టును ఉద్దేశించి ఆరోపణలు చేశారని, అయితే ఒక్క అంగుళం భూమిని కూడా ఉచితంగా ఇవ్వలేదన్నారు. గుజరాత్ అభివృద్ధిపై తన మాటలు అబద్ధమైతే రాష్ట్ర ప్రజలు తనను తిరిగి ఎన్నుకుని ఉండేవారు కారన్నారు.
భారీ పోలింగ్ నా బాధ్యత పెంచింది: మోడీ
బాలసోర్(ఒడిశా)/ధంతారి(ఛత్తీస్‌గఢ్): లోక్‌సభ ఎన్నికల్లో భారీ పోలింగ్ ప్రజల పట్ల తన బాధ్యత పెంచిందని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన శుక్రవారం ఒడిశాలోని బాలాసోర్, కియోంజర్, తాల్చేర్, ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారిల్లో ఎన్నికల సభల్లో మాట్లాడారు. ‘ఒడిశాలో గురువారం జరిగిన ఎన్నికలు, ప్రజల ఆప్యాయతను చూస్తే మీ పట్ల నా బాధ్యతలు పెరిగినట్లు అనిపిస్తోంది.
నాపై మీ ప్రేమకు ప్రతిఫలం అందిస్తా’ అని ఒడిశా సభల్లో అన్నారు. దేశప్రజలంతా ప్రభుత్వం మారాలనుకుంటున్నారని, వారు ఢిల్లీ గద్దెపై ఉన్న వారికి బుద్ధి చెబుతారని అన్నారు. రాహుల్ గాంధీకి పేదరికం పర్యాటకం లాంటిందని ధంతారి సభలో మండిపడ్డారు. విభజించు, పాలించు అనే కాంగ్రెస్ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ విభజన అద్దం పడుతోందని, అది సమాజాన్ని ముక్కలు చేసే పార్టీ అని విమర్శించారు. దేశానికి ఏం చేశారో చెప్పని కాంగ్రెస్ తనపై బురదజల్లుడు ప్రచారానికి దిగుతోందని మోడీ విమర్శించారు.
త్రీడీ హాలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీ ద్వారా అహ్మదాబాద్ నుంచి దేశంలోని వంద ప్రాంతాల్లో నిర్వహించిన సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ టెక్నాలజీ ద్వారా నిర్వహించే సభల్లో వక్త ప్రత్యక్షంగా మాట్లాడుతున్న అనుభూతి కలుగుతుంది. ఇదిలా ఉండగా, మోడీ ప్రధాని అయితే భారత భవిష్యత్తుకు కీడు జరుగుతుందని సల్మాన్ రష్దీ, దీపామెహతా తదితర రచయితలు, కళాకారులు లండన్‌లో విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.