
కుంభకోణాల కాంగ్రెస్ కనుమరుగు
మదనపల్లె/తిరుపతి: కుంభకోణాల కాంగ్రెస్ కనుమరుగైపోయిందని బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలోనూ, తిరుపతిలో విలేకరులతోనూ మాట్లాడారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థికవనరులను పూర్తిగా దోచుకుందని ధ్వజమెత్తారు. కేంద్రంలో సుస్థిరమైన పాలనతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
వైఎస్‌ఆర్, ఎన్టీఆర్ ప్రారంభించిన పోలవరం, వెలుగోడు, పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్రంలో దృఢమైన నిర్ణయాలు తీసుకునే సుస్థిర ప్రభుత్వం అవసరమన్నారు. రాష్ట్రం నుంచి 25 మంది ఎంపీలను నరేంద్ర మోడీకి అందించగలిగితే విభజన నేపథ్యంలో బీజేపీ ఒత్తిడితో పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎన్డీఏ అమలు చేయగలుగుతుందన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం రాగానే ప్రతి చేనుకూ నీరందిస్తామనీ, ప్రతి చేతికీ పని కల్పిస్తామన్నారు. పారిశ్రామిక కారిడార్లు నెలకొల్పి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర రాష్ట్రాలకు కూలీ కోసం వలసలు నివారిస్తామన్నారు. మదనపల్లెలో నిర్వహించిన రోడ్‌షోను జనం అంతగా రాలేదు.