
బాలరాజుకు గుణపాఠం
పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో 2009 ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా ఐదేళ్ల పాటు పనిచేసిన పి.బాలరాజుకు ఈ ఎన్నికల్లో ఓటర్లు గుణపాఠం చెప్పారు. పాడేరు నియోజకవర్గంలో రికార్డుస్థాయిలో అభివృద్ధి చేశానని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. మాజీ మంత్రి చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. మంచినీటి సమస్యను పరిష్కరించలేదు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని గిరిజనులంతా ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్ల నిర్మాణం కూడా కాంగ్రెస్ కార్యకర్తల సూచనల మేరకే ఆయా గ్రా మాల్లో చేపట్టి మారుమూల గ్రామాలను మాత్రం నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా పక్షపాతధోరణి అవలంబించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను కూడా వ్యాపార కేంద్రాలుగానే మార్చేసేలా కాంగ్రెస్ పాలన మారింది. వార్డెన్ పోస్టులను అనర్హులకే కేటాయించారనే విమర్శలు ఉన్నాయి.
ఇందిరమ్మ గృహాల మంజూరులో గిరిజనులకు అన్యా యం చేశారని, అర్హులైన గిరిజనులు పునాదులు తవ్వుకున్నా ఇళ్లు మాత్రం మంజూరు చేయలేదు. ఎమ్మెల్యే కోటా కింద వచ్చిన 2 వేల గృహాలు కూడా గత ఏడాది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న గ్రామాల్లోని గిరిజనులకే కేటాయించారు. దీంతో అనేక మంది గిరిజనులంతా మాజీ మంత్రి బాలరాజు తీరుపై మండిపడుతున్నారు. కొయ్యూరు నుంచి పాడేరు వరకు ఐదు మండలాల్లో బాలరాజు పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అండతో గెలిచిన బాలరాజు మహానేత మరణానంతరం అన్ని వర్గాల గిరిజనుల సంక్షేమాన్ని మరిచిపోయారు. నియోజకవర్గంలో ఏ పోలింగ్ కేంద్రంలో కూడా బాలరాజు తన ప్రభావం చూపలేకపోయారు. అవినీతి, అక్రమాల్లే వల్లే బాలరాజును ఈ ఎన్నికల్లో ఓడించామని గిరిజనులు చెబుతున్నారు. ఐదేళ్లు మంత్రిగా ఉన్న బాలరాజు ఈ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నారు.