న్యూఢిల్లీ: బీజేపీ, కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధం ముదిరి సీడీల రూపంలో విమర్శలకు మరింత పదును పెడుతున్నారు. వెయ్యి కోట్ల రూపాయిల హవాల కుంభకోణంలో అరెస్ట్ అయిన అఫ్రాజ్ ఫట్టా అనే వ్యక్తితో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కలసి ఉన్న చిత్రాలతో కూడిన సీడీని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నరేంద్ర మోడీకి ధైర్యముంటే స్వతంత్ర విచారణకు అంగీకరించాలని సవాల్ విసిరింది. ఫట్టా బీజేపీకి, మోడీకి మద్దతు దారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా చెప్పారు. హవాల కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిందని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ సీడీని విడుదల చేసిన మరుసటి రోజు కాంగ్రెస్ మోడీపై సీడీ విడుదల చేయడం గమనార్హం. భూ కంభకోణాల్లో వాద్రా పాత్ర ఉందని బీజేపీ ఆ సీడీల్లో ఆరోపించింది.