రాజమండ్రి రూరల్ / కడియం, న్యూస్‌లైన్ :ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద అభ్యర్థులు, ఏజెంట్లు నానా పాట్లు పడ్డారు. ఆరు మండలాల నుంచి 124 మంది ఎంపీటీసీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు, జెడ్పీటీసీ అభ్యర్థుల ఏజెంట్లు బొమ్మూరులోని నాక్ భవనం వద్దకు ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. రెండు విడతలుగా లెక్కింపు జరుగుతున్నప్పటికీ మొత్తం అభ్యర్థులు, ఏజెంట్లను లోనికి అనుమతించారు. లెక్కింపు మొదలయ్యాక 8 గంటల సమయంలో తొలి విడత లెక్కింపు జరుగుతున్న స్థానాలకు సంబంధించిన వారే ఉండాలని, మిగిలిన వారు బయటకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. కాగా ప్రవేశద్వారం వద్ద ఉన్న పోలీసులు ఒక్కసారి లోపలికి వస్తే మళ్లీ బయటకు పంపబోమని అడ్డుకున్నారు. దీంతో అటు కేంద్రంలోకి వెళ్లలేక, ఇటు బయటకు రాలేక వారు ఇబ్బందులు పడ్డారు.
లంచ్ విరామం తర్వాత రెండో విడత ఓట్ల లెక్కింపు ప్రారంభించేంతవరకూ అభ్యర్థులు, ఏజెంట్లు భవనాల నీడనే కాలం గడిపారు. కనీసం వీరికి మంచినీళ్లు కూడా కరువయ్యాయి. తాగునీటి వసతి ఏర్పాటు చేయని అధికారుల తీరును పలువురు విమర్శించారు. బయటనుంచి తెచ్చుకోవాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు. లంచ్ విరామ సమయంలో కాస్త సడలింపు ఇవ్వడంతో బయటనుంచి నీళ్లు, ఆహారం తెప్పించుకున్నారు. భవనం బయట కాపలా ఉన్న పోలీసు సిబ్బంది బాధలూ ఇలాగే ఉన్నాయి. బయటినుంచి నీళ్లు, ఆహారం తెచ్చుకుంటున్న వారిని బతిమాలి పోలీసులు వాటర్ బాటిల్స్ తీసుకోవడం కనిపించింది. ఉదయం లోపలికి అనుమతించేటపుడే రెండో విడత కౌంటింగ్ వారిని మినహాయించి ఉంటే తమకు ఈ ఇబ్బందులు తప్పేవని ఏజెంట్లు, అభ్యర్థులు పేర్కొన్నారు.
కౌంటింగ్ కష్టాలు
Published Wed, May 14 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement