తమ్ముళ్ల బరి తెగింపు | tdp Money Alcohol Distribution | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల బరి తెగింపు

Published Wed, May 7 2014 12:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:40 PM

తమ్ముళ్ల బరి తెగింపు - Sakshi

తమ్ముళ్ల బరి తెగింపు

సాక్షి, రాజమండ్రి :టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రసంగాల్లో నీతి గురించి మాట్లాడతారు. కానీ ఆయనే తన పార్టీని నోట్ల పంపకంలో ముందుంచుతున్నారు. ప్రజాస్వామ్య విలువలను వల్లెవేస్తూ తమ్ముళ్లూ అంటూ ప్రసంగాలు దంచేస్తారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా ధన ప్రవాహానికి తెర లేపింది. ఇప్పటికే    నియోజకవర్గాల్లో రూ. కోట్లు వెదజల్లిన తమ్ముళ్లు మంగళవారం రాత్రి బరితెగించి మరీ డబ్బు పంపిణీ చేపట్టారు. నిన్నమొన్నటి వరకూ ఓటుకు రూ. 500 పంచిన పార్టీ మంగళవారం ధరను రెట్టింపు చేసింది. కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీల పంపకాలను బేరీజు వేసుకుని అందుకు రెట్టింపు డబ్బును పంపిణీ చేశారు. ఓటుకు రూ. 1000 నుంచి రూ. 1500 వరకూ చెల్లించారు.
 
 అడ్డంగా దొరికిపోతున్న తమ్ముళ్లు
 డబ్బులు పంచుతూ టీడీపీ వర్గాలు ఎక్కడికక్కడ అడ్డంగా దొరికిపోతున్నారు. మంగళవారం జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గోకవరం మండలం రంప ఎర్రంపాడులో తమ్ముళ్లు పంపిణీ చేస్తున్న రూ. 9000 వేలు తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంచుతూ రూ. 30 వేల నగదుతో టీడీపీ కార్యకర్తలు పట్టుబడ్డారు. సోమవారం రాత్రి పెద్దాపురం బ్యాంకు కాలనీలో వాహనాల తనిఖీలో ఓటర్లకు పంచేందుకని భావిస్తున్న రూ. 4.5 లక్షలు పోలీసులకు చిక్కింది. కాట్రేనికోనలో డబ్బు పంచుతున్న టీడీపీ కార్యకర్తల నుంచి రూ. 70 వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల వీధిలైట్లు ఆర్పించేసి మరీ  డబ్బు పంపిణీ చేశారు.
 
 ఏరులై పారిన మద్యం
 సోమ, మంగళవారం రాత్రి వేలాది బాటిళ్ల మద్యాన్ని టీడీపీ శ్రేణులు పేదల వాడల్లో పంపిణీ చేశారు. కొన్నిచోట్ల డబ్బుతోపాటు మద్యం బాటిళ్లు కూడా అందజేశారని తెలుస్తోంది. తొండంగి మండలం చోడిపల్లిపేట గ్రామంలో టీడీపీ కార్యకర్తల నుంచి సుమారు 350 వరకూ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నుంచి మద్యం దుకాణాలను ఎన్నికల అధికారులు మూసి వేయించారు. అయినా దొంగతనంగా షాపులు తెరిపించి రాత్రుళ్లు మద్యం నిల్వలు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. రావులపాలెం మండలంలోని ఈతకోట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మట్టా సత్యనారాయణ స్వగృహంలో ఎనిమిది కేసుల్లో 384 మద్యం బాటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
 బీజేపీ నేతపై మహిళల మండిపాటు
 రాజమండ్రి బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ ఇంటి వద్ద మంగళవారం మహిళలు ఆందోళన చేశారు. తమ వాడల్లో డబ్బు పంపకాలు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ డబ్బు పంపిణీలో కూడా మతతత్వం ప్రదర్శిస్తోందని దళిత క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ద ళితవాడలకు వచ్చి అగ్రవర్ణాలకు డబ్బులు పంపి, దళితులు మీకు డబ్బెందుకు ఇవ్వాలంటూ అవమానిస్తున్నారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు తమ ప్రాంతాల్లో డబ్బు పంపకాలను బీజేపీ నిలుపు చేయాలని హెచ్చరించారు.
 
 కరెంటు బిల్లుల బరువు మోపారు
 ఎన్నో వ్యయప్రయాసలతో సాగు చేస్తున్న రైతులకు చేయూతనందించాల్సింది పోయి కరెంటు బిల్లుల రూపంలో చంద్రబాబు మరో బరువు మోపారు. దీంతో ఒక్కసారిగా రైతులు కుదేలయ్యారు. పూర్తిస్థాయిలో కరెంటు వచ్చేది కాదు. దానికి కూడా భారీగా బిల్లులు రావడంతో చాలామంది ఇబ్బదులు పడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉచిత విద్యుత్ అమలు చేయడంతో ఆ బాధ తప్పింది.
 - బోణం సత్యనారాయణ, రైతు, కడియం
 
 రైతు గురించి ఎప్పుడు ఆలోచించలేదు
 చంద్రబాబు హయాంలో కరెంటు సరఫరా సక్రమంగా ఉండేది కాదు. దీంతో చేలు మొత్తం ఎండిపోయేవి. ఏటా తీవ్రంగా నష్టపోయేవాళ్లం. అయినా రైతుల కోసం ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు.
 - ఎం.సీతారామయ్య, కృష్ణునిపాలెం, గోకవరం మండలం
 
 బోర్లకు కరెంటు అందేది కాదు
 చంద్రబాబు కాలంలో పొలాల్లో ఉన్న బోర్లకు కరెంటు అందక పంటలన్నీ ఎండిపోయాయి. ఏ సమయంలో కరెంటు ఇస్తారో తెలియక రాత్రి, పగలు తేడా లేకుండా పడిగాపులు కాయవలసిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు రైతులను నమ్మించి మోసగించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
 - బి.తాతీలు, రైతు, గోర్స, కొత్తపల్లి మండలం
 
 రైతులు వలసపోయారు
 గిట్టుబాటు ధర లేక నాడు పండించిన పంటను ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితితో రైతులు కుదేలయ్యారు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో పంటలు దెబ్బతిని, మరోవైపు పండించిన పంటకు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పల పాలై గ్రామాలు విడిచి వలసపోయారు.
 - టేకుమూడి మల్లేశ్వరరావు, తాళ్లపొలం, రామచంద్రపురం మండలం
 
 తొమ్మిదేళ్ళ చేదు కాలం..
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పదవీ కాలంలో చవి చూపించిన చేదు అనుభవాలను నేటికీ రైతులు మరవలేకపోతున్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ఉచితవిద్యుత్ మాట అటుంచి, వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను నిలిపేసి, రైతు కంట నీరు పెట్టించిన రాక్షస పాలన అది. దాన్ని మరవకుండానే ‘రైతు రుణమాఫీ’అంటూ మభ్యపెట్టి అధికారంలోకి రావాలనుకోవడం దారుణం.
 - గోపు నారాయణమూర్తి, రైతు సంఘం నాయకుడు, తాడిపర్తి, పెద్దాపురం మండలం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement