ఓటు వేస్తే ‘వెయ్యి’
సాక్షి, రాజమండ్రి :జనాదరణ కొరవడ్డ తెలుగుదేశం పార్టీ ‘ధన వితరణ’తోనే ఎన్నికలలో గెలుపు తీరం చేరాలని ఆరాటపడుతోంది. ఆ క్రమంలోనే అసలు పోలింగ్‌కు ముందు జరిగే ‘కొసరు పోలింగ్’ లాంటి పోస్టల్ బ్యాలెట్ సందర్భంగానే నోట్లు వెదజల్లడానికి తెరతీసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే వివిధ శాఖల ఉద్యోగులు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఓటేసే ఉద్యోగులకు ప్యాకేజీలు ఎరవేసి మరీ లబ్ధి పొందాలని తెలుగుదేశం వారు ప్రయత్నిస్తున్నారు. డివిజన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించే భవనాల సమీపంలో టీడీపీ ఏజెంట్లు మాటేసి మరీ ఓటుకు నోటు ఇవ్వజూపుతున్నారు. అధికారుల కళ్లు కప్పి, నోట్లను పంపిణీ చేస్తున్నారు.
ఈసారి పోస్టల్ బ్యాలెట్‌లో మార్పు తెచ్చారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది, పోలీసులు ఆయా డివిజన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ నిర్వహించే చోటికి వెళ్లి ఓటు వేయాలి. ఈనెల 25 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో తొలిరోజు పోలీసుల కోసం పోలింగ్ నిర్వహించారు. తర్వాత ఇతర శాఖల ఉద్యోగుల కోసం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల సమీపంలోని దుకాణాలు, కిళ్లీ బడ్డీలను వేదికగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు ఉద్యోగులకు రెండు రోజులుగా డబ్బు పంపిణీకి తెర తీశారు. ముందుగా ఆయా కేంద్రాలకు వచ్చే ఉద్యోగుల జాబితా సంపాదించి, వారితో ఫోన్‌లో మాట్లాడి తమ వద్దకు రప్పించి లేదా వారున్న చోటికే వెళ్లి రూ.1000 చొప్పున ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. స్థానికంగా ఓటు ఉండి, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి దగ్గరకు కార్యకర్తలను పంపి, సొమ్ములిస్తామని ‘సైకిల్’కు ఓటేయండని కోరుతున్నారు. టీడీపీ వారు తమను ఇళ్ల వద్ద, వివిధ ప్రాంతాల్లో కలిసి డబ్బు ఇవ్వజూపడం ఇబ్బందిగా ఉందని పలువురు ఉద్యోగులు ‘సాక్షి’ ఎదుట వాపోయారు.
ఉద్యోగ నేతలకు ప్యాకేజీలు..
తెలుగుదేశం నేతలు శని, ఆదివారాల్లో పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్న రాజమండ్రి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల పరిసరాల్లో ఉండి లోపలికి ఎవరు వెళ్తున్నారో గుర్తించి ఫోన్‌లో వాళ్లతో సంప్రదించి తమ వద్దకు వచ్చి డబ్బులు తీసుకు వెళ్లాలని, ఓటు తమకు వేయాలని కోరారు. శనివారం టీడీపీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ పోలింగ్ కేంద్రం పరిశీలనకు లోపలికి వెళ్లిన సమయంలో బయట ఓ రహస్య ప్రాంతంలో ఆ పార్టీ వారు నోట్ల పంపిణీ చేపట్టారు. టీడీపీ కార్యకర్తలు అమలాపురం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆవరణలో కూడా ఇదే దందాకు తెర లేపారు. ఓ పదిమంది ఉద్యోగులను పోలింగ్ కేంద్రానికి తరలించి ఓటు వేయిస్తే ఉద్యోగ సంఘాల నేతలకు టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఓటుకు రూ.1000 చెల్లించడంతో పాటు ఓట్ల సంఖ్యను బట్టి సదరు నాయకుడికి భారీగా నజరానా ఇస్తోంది. ఉద్యోగ సంఘాలతో టీడీపీ వారు ఫోన్లలో సంప్రదించి ‘మీ బ్యాచ్‌తో పాటు ఫలానా ప్రాంతానికి రండి’ అని సూచిస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలుగా చలామణీ అవుతున్న పలువురు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ యూనియన్ కార్యాలయాల వద్ద చిరుద్యోగులను ప్రలోభ పెడుతున్నట్టు సమాచారం. కాగా పెద్ద పార్టీలకు అనుబంధంగా ఉండే ఉద్యోగ సంఘాలు టీడీపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాల్లో కూడా టీడీపీ ఇదే రకంగా ప్రలోభాలకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
డ్వాక్రా సంఘాలనూ వదలడం లేదు..
టీడీపీ నేతలు డ్వాక్రా సంఘాలకు గ్రూపుల వారీగా ప్యాకేజీలు మాట్లాడే పనిని ఆయా ప్రాంతాల్లోని ద్వితీయ, తృతీయ స్థాయి కేడర్‌కు అప్పగించారని తెలుస్తోంది. వీరు జిల్లాలోని డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు ఫోన్ చేసి ‘మీ సంఘం సభ్యులతో ఓట్లు వేయిస్తే ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తా’మని ప్రలోభ పెడుతున్నారు. కేవలం డబ్బు పంపిణీపైనే ఆశలు పెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో ఓటుకు రూ.వెయ్యిగా నిర్ధారించి, అవసరమైన డబ్బు కట్టలను ఆయా నియోజక వర్గాలకు తరలించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందని సమాచారం. రాజమండ్రి కార్పొరేషన్ నుంచి డ్వాక్రా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శుల జాబితాలు సేకరించి, ఆదివారం నుంచే వారితో సంప్రదింపులు ప్రారంభించారని తెలుస్తోంది.