సీపీఐ -కాంగ్రెస్ స్థానాలు ఖరారు
సీపీఐకి కేటాయించే స్థానాలపై ఓ నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్
దిగ్విజయ్‌తో పొన్నాల, ఉత్తమ్, రాజనర్సింహ భేటీ
సీపీఐ సీనియర్ నేత రాజాతోనూ సమావేశం
ఆ పార్టీకి హుస్నాబాద్‌కు బదులు నాగర్‌కర్నూలు అసెంబ్లీ?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో సీపీఐకి కేటాయించే స్థానాలపై మంగళవారం సాయంత్రానికి కాంగ్రెస్ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీకి 8 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు కేటాయించేందుకు మొగ్గు చూపిన కాంగ్రెస్ వాటిని దాదాపుగా ఖరారు చేసింది. కాంగ్రెస్ కేటాయించనున్న స్థానాలపై సీపీఐ జాతీయ, రాష్ట్ర నాయకత్వం సైతం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ స్థానంతోపాటు మునుగోడు, దేవరకొండ, కొత్తగూడెం, బెల్లంపల్లి, వైరా, మహేశ్వరం, స్టేషన్‌ఘన్‌పూర్ స్థానాలను సీపీఐకి కేటాయించాలని తుది నిర్ణయానికి వచ్చారు. కాగా, హుస్నాబాద్ అసెంబ్లీకి బదులు నాగర్‌కర్నూలు స్థానాన్ని సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కసరత్తు దాదాపు పూర్తి కావడంతో, కాంగ్రెస్ పెద్దలు సీపీఐతో పొత్తుపై మంగళవారం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీపీఐకి ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు కేటాయించాలన్న అంశంపై కాంగ్రెస్ నేతలు విస్తృతంగా చర్చించారు.
మొదట ఉదయం పది గంటల సమయంలో ఓ హోటల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ సమావేశమయ్యారు. ఇంకా ఖరారుకాని 15, 16 అసెంబ్లీ స్థానాలపై సమాలోచనలు జరిపారు. వీటికి ఇద్దరి పేర్ల చొప్పున షార్ట్‌లిస్ట్ తయారు చేసిన అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ నివాసానికి చేరుకున్నారు.
అక్కడ 3 గంటలకు పైగా ఆయనతో చర్చించారు. పెండింగ్ స్థానాలతోపాటు సీపీఐకి కేటాయించే సీట్లపై చర్చించారు. సీపీఐకి కేటాయించే స్థానాలకు సబంధించి ఆయా జిల్లాల నేతలతో ఈ సందర్భంగా దిగ్విజయ్ నేరుగా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. అనంతరం దిగ్విజయ్ సహా పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలు సీపీఐ నేత డి.రాజా వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఓ రహస్య ప్రదేశంలో గంటకు పైగా భేటీ అయ్యారు. సీపీఐకి కేటాయించాలనుకుంటున్న స్థానాలపై ఈ సందర్భంగా రాజా సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజాతో భేటీ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో పొన్నాల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహలు మరోమారు చర్చలు జరిపారు.