కొడవలి కంట్లో కాంగ్రెస్ కారం!
తెలంగాణ ప్రాంతంలో సీపీఐ- కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన పొత్తు అంశం ఇరు పార్టీల్లో అగ్గి రాజేస్తోంది. ఒప్పందంలో భాగంగా తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం లోక్సభ స్థానాన్ని సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారు. కాగా, కాంగ్రెస్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఆదిలోనే తూట్లు పొడిచింది. సీపీఐకి ఇచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసి సీపీఐకి ఝలక్ ఇచ్చింది. దీంతో సర్దుబాటు ధోరణి అలవాటు చేసుకున్న సీపీఐ వెనక్కి తగ్గక తప్పలేదు. కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల సర్దుబాటు పంచపాండవులు మంచపు కోళ్లను తలపిస్తోంది. తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు కోరిన సీపీఐ.. ఆ సంఖ్యను 12కు కుదించుకుంది. చివరకు సంప్రదింపుల అనంతరం సీపీఐకి కాంగ్రెస్ 9 స్థానాలు ఇస్తామని తెలిపింది. సీటు మార్పులో భాగంగా రామగుండం కేటాయించిన కాంగ్రెస్ ఆ సీటును కూడా వదల్లేదు. సర్లే 8 స్థానాలతో సరిపెట్టుకుందామంటే కాంగ్రెస్ మరొక సీటుకు ఎసరు పెట్టింది.
పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీయే బి.ఫారాలిచ్చి తమ నేతలతో నామినేషన్ దాఖలు చేయించింది. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. సీపీఐకి ఇచ్చిన మిగిలిన ఆరు స్థానాల్లోనూ స్థానిక కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ను కాదనుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఇంత దెబ్బ కొడతారా అంటూ సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను ఎలా తప్పుతారంటూ సీపీఐ తెలంగాణ, సీమాంధ్ర ఉమ్మడి కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు కూడా. ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం మాత్రం శూన్యం. అసలు కాంగ్రెస్ తో పొత్తు అనే అంశమే సరైన విధానం కాదని సీపీఐ నేతలు అభిప్రాయపడుతున్నారు. కొడవలి కంట్లో కాంగ్రెస్ కారం చల్లడంతో సీపీఐ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితంకాక తప్పడం లేదు.