సీపీఐ - కాంగ్రెస్ పొత్తు ఖరారు?
తెలంగాణ ప్రాంతంలో సీపీఐ- కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం లోక్సభ స్థానాన్ని కూడా సీపీఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ పెద్దలు అంగీకరించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 80 శాతం వరకు స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలన్న విషయాన్ని ఇప్పటికే నిర్ధారించారని, మిగిలిన 20 చోట్ల కొత్త అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సీపీఐకి కేటాయించే అసెంబ్లీ స్థానాలు ఇలా ఉన్నాయి.. బెల్లంపల్లి, మునుగోడు, వైరా, కొత్తగూడెం, దేవరకొండ, మహబూబాబాద్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్, హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తారు. ఇక ఎంఐఎంతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని స్థానాలతో పాటు, తెలంగాణలో కూడా కొన్నిచోట్ల మజ్లిస్ అభ్యర్థులు పోటీచేయడానికి ఉత్సుకత చూపిస్తున్నారు.