
దామోదర.. వైఎస్ వారసుడు కాదు
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం ఒక్క జగన్‌కే తప్ప మరెవ్వరికీ లేదని, ఆయన పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తే ప్రజలు నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ‘
నల్లా సూర్యప్రకాశ్ స్పష్టీకరణ
హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వం ఒక్క జగన్‌కే తప్ప మరెవ్వరికీ లేదని, ఆయన పేరు చెప్పుకుని ఓట్ల రాజకీయం చేస్తే ప్రజలు నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. ‘తెలంగాణకు నేనే సీఎం అంటూ తిరుగుతున్న దామోదర రాజనరసింహ ఏనాటికీ వైఎస్ వారసుడు కాలేడు. ఓట్ల కోసం చేసే ఇలాంటి ఎత్తుగడలను ప్రజలు ఛీ కొడతారు’ అని పేర్కొన్నారు.వైఎస్ సేవలు ఎనలేనివని, మళ్లీ ఆ శక్తి సామర్థ్యాలు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని, వైఎస్ వారసుడు ఆయనేనని అన్నారు.
నల్లా సూర్యప్రకాశ్ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఇటీవల ఓ కార్యక్రమంలో వైఎస్సార్ తన గురువు అని, ఆయన అడుగు జాడల్లోనే నడుస్తానని, మాట తప్పను, మడమ తిప్పనని చెప్పుకోవడం సిగ్గు చేటని నల్లా నిప్పులు చెరిగారు. ఓట్ల కోసమే దామోదర ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌పై అంత అభిమానం ఉంటే ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పుడు, సీబీఐకి చెందిన 20 బృందాలు ఒకేసారి ఆయన కుటుంబంపై దాడులకు దిగినప్పుడు దామోదర ఎందుకు చూస్తూ ఉండిపోయారని నిలదీశారు. అక్రమ కేసులు బనాయించి జగన్‌ను 16 నెలలు జైల్లో పెడితే ఎందుకు నోరెత్తలేదని దామోదరను ప్రశ్నించారు.