ప్రజాస్వామ్య పండగలో పదనిసలు
మన దేశంలో జరగబోయే ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు. మన దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 81.5 కోట్లు. ఇది అమెరికా ఓటర్ల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. అమెరికాలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 21.9 కోట్లే. భారతదేశం తరువాత ఎక్కువ ఓటర్లున్న దేశాలు అమెరికా, ఇండోనీసియా, బ్రెజిల్, రష్యా, బంగ్లాదేశ్ లు. ఈ అయిదు దేశాల మొత్తం ఓటర్లు కలిపినా మన దేశంలోని ఓటర్ల కన్నా తక్కువే. ఈ అయిదు దేశాల మొత్తం ఓటర్ల సంఖ్య 74.9 కోట్లే.
*ఇందులో మహిళా ఓటర్ల సంఖ్య 38.8 కోట్లు. పురుష ఓటర్ల సంఖ్య 42.7 కోట్లు. ఆడ, మగ కాక ఇతర క్యాటగరీలో 28,341 మంది ఓటర్లున్నారు.
* గత లోకసభ ఎన్నికలు 2009 లో జరిగాయి. అప్పటికీ ఇప్పటికీ దేశంలో 9.7 కోట్ల మంది కొత్త ఓటర్లు వచ్చి చేరారు. ఈ సంఖ్య ఫిలిప్పీన్స్ మొత్తం ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 17.3 కోట్లే. అంటే 1952 నుంచి ఇప్పటికి ఓటర్ల సంఖ్య అయిదింతలు అయ్యిందన్నమాట.
*ఈ ఎన్నికల్లో తొలిసారి వోటు వేయబోతున్న యువ ఓటర్ల సంఖ్య 2.30 కోట్లు. వీరంతా 18-21 ఏళ్ల వయసున్న వారు.
* భారతదేశంలో ఎన్నికలంటే మాటలు కాదు. మొత్తం ఓటర్లలో 96 శాతం మందికి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 9.30 లక్షల పోలింగ్ బూత్ లు ఏర్పాటయ్యాయి. ఇందులో 17 లక్షల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు ఏర్పాటవుతాయి. ఎన్నికలను నిర్వహించడానికి 11 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మన ఎన్నికలు నిజంగా ప్రజాస్వామ్యపు పండుగ!