మన తలరాతను మార్చే ఎన్నికలివి: వైఎస్ జగన్
రామచంద్రాపురం: మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మన తలరాతను మార్చేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా గుండె లోతుల్లో దివంగత నేత వైఎస్‌ఆర్ ఉన్నారని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు షోలో జగన్ ప్రసంగించారు. రాముడి పాలనను చూడలేదు కానీ...రాజశేఖరుని సువర్ణయుగాన్ని చూశామన్నారు.
ఇప్పటికీ బాబు భయానక పాలన గుర్తుకు వస్తోందన్నారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, ఉచిత విద్యుత్ ఇస్తానని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి... లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
ప్రతి పిల్లవాడ్ని తాను చదివిస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానన్నారు. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా రెండో సంతకం, రైతన్న ఇంట వెలుగు నిండేలా మూడో సంతకం చేస్తానని చెప్పారు. పల్లెలకు స్వయంపాలనపై మరో సంతకం చేస్తానని వైఎస్ జగన్ అన్నారు.