అంతా బయటి జనమే
- తిరుపతిలో నిరాశాజనకంగా మోడీ సభ
- పవన్‌కల్యాణ్ ప్రసంగం పూర్తికాగానే అభిమానుల నిష్ర్కమణ
- బాబు మాట్లాడగానే వెళ్లిపోయిన దూర ప్రాంతవాసులు
తిరుపతి, న్యూస్‌లైన్: తిరుపతిలో బుధవారం బీజేపీ,టీడీపీ కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం ఆశించిన స్థాయిలో రాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. సీమాంధ్ర లో ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్నికల ప్రచార సభకు కనీసం లక్షమందిని సమీకరించాలని రెండు పార్టీల నాయకులు భావించారు. అయితే తిరుపతి పట్టణంలోని జనాభాలో కనీసం మూడో వంతు జనాన్ని కూడా సభకు రప్పించలేకపోయారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో జనాన్ని తరలించి,ఆయా ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులను, పవన్‌కల్యాణ్ అభిమానులను రప్పించి పరువు నిలుపుకోవడానికి అగచాట్లుపడ్డారు. సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీతో బాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడు, సినీనటుడు పవన్‌కల్యాణ్ ప్రసంగాలు చేశారు.
నరేంద్రమోడీ హిందీ ప్రసంగాన్ని వెంకయ్యనాయుడు తెలుగులో అనువదించారు. పవన్‌కల్యాణ్ ప్రసంగం పూర్తికాగానే ఆయన అభిమానులు చాలామంది సభాప్రాంగణం నుంచి నిష్ర్కమించారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాగానే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు బయటకు వెళ్లిపోతుండడం కనిపించింది.
సీమాంధ్రను ఆదుకోవాల్సింది మోడీయే: బాబు
సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, తీరని అన్యాయం చేసిందని చంద్రబాబు తన ప్రసంగంలో దుయ్యబట్టారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రను ఆదుకొని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మోడీదేనన్నారు. సీమాంధ్రకు కనీసం 15 ఏళ్లు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని, పోలవరాన్ని ఐదేళ్లలో పూర్తి చే యాలని మోడీని కోరారు.
తిరుపతిలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించింది తానేనని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న విధంగా సీమాంధ్రలో ఐటీ,ఐఐటీ వంటి విద్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని, అది ఎన్డీయే ద్వారా సాధ్యమవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. కేసీఆర్‌కు భయపడేది లేదన్నారు. ‘కేసీఆర్! నాతో పెట్టుకోకు అడ్రస్ లేకుండా పోతావ్’ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశారు.
తాను ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌లో కాకుండా సీమాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి, మోడీ ప్రధాని కావడానికి ప్రజల సహకారం అవసరమన్నారు. ఇది ఎన్నికల శంఖారావ సభ కాదని ఎన్డీఏ విజయోత్సవ సభ అని చంద్రబాబు అభివర్ణించారు. తమ కూటమిని గెలిపిస్తే మోడీ సహకారంతో దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రభాగాన నిలబెడతామని, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, మరో సింగపూర్‌గా అభివృద్ధి చేస్తానన్నారు.