'మోడీ, బాబు కలిస్తే అభివృద్ధి కాదు... అధోగతే'
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలసి చేసేది అభివృద్ధి కాదని... రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ప్రజలకు హెచ్చరించారు. గురువారం తిరుపతి విచ్చేసిన ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ...బీజేపీతో టీడీపీ పొత్తు తెలుగు జాతికి చేస్తున్న చారిత్రక ద్రోహంగా ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో అసలు పట్టు లేని పార్టీ బీజేపీ అని... అలాంటి పార్టీని ప్రజలపై చంద్రబాబు బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న వ్యత్యాసమేంటో చెప్పాలని చంద్రబాబును రాఘవులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని విమర్శించారు. రాష్ట్ర విభజనలో ఆ మూడు పార్టీలు తోడు దొంగలని విమర్శించారు. ఎన్నికల్లో ఆ పార్టీలను గెలిపిస్తే దోడుకోవడంలోనే కాక బాబు, మోడీలు తోడు దొంగలుగా ఉంటారని రాఘవులు తెలిపారు. తోడు దొంగల పార్టీలను ప్రజలు తిరస్కరించాలని రాఘవులు ప్రజలకు పిలుపునిచ్చారు. మోడీ బాబు కూటమిని ఓడించేందుకు అంతా కంకణం కట్టుకోవాలని ఆయన ప్రజలకు హితవు పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెతక వైఖరి అవలంభిస్తే తెలుగు ప్రజలకు తీరని నష్టమని ఆయన సూచించారు. టీడీపీ, బీజేపీ కూటమీని కటువుగా ఎదుర్కొంటేనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
నిన్న కాక మొన్న వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నరేంద్ర మోడీలో అంత గొప్పతనం ఏం చూశాడో అర్థం కావడం లేదన్నారు. గుజరాత్ అల్లర్లలో మైనార్టీల ఊచకోత సమయంలో నోరు ఎందుకు మెదపలేదని రాఘవులు ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. చేగువేరా బదులు మోడీ బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన పవన్ ప్రజలకు మేలు చేసినట్లు కాదని రాఘవులు అభిప్రాయపడ్డారు.