అది కాలకూట విషపు జట్టు
మోడీ, బాబు, పవన్‌లపై రాఘవులు ధ్వజం
అనంతపురం /కడప, నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జట్టు అభివృద్ధి కోసం ఏర్పడినది కాదని, అది ఒక కాషాయ కాలకూట విషం వెదజల్లే జట్టని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభివర్ణించారు. బీజేపీ మతతత్వ విధానాలు దేశ సమగ్రతకే ప్రమాదమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకొని రాష్ట్ర విభజనకు సహ కరించి తెలుగు పదానికి చంద్రబాబు అపచారం చేశాడని విమర్శించారు. శుక్రవారం అనంతపురంలో విలేకరులతో, కడపలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోడి ప్రధాని అయితే గుజరాత్ తరహా కార్పొరేట్ విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే ప్రమాదముందన్నారు.
ఆయన ప్రధాని కావడం చారిత్రక అవసరం కాదని, చారిత్రక అపచారం అవుతుందని హెచ్చరించారు. వీరు అధికారంలోకొస్తే ప్రపంచ బ్యాంకు విధానాలు అమలు చేస్తారని, తద్వారా సామాజిక న్యాయం జరగదని వివరించారు. పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ పెట్టాడో.. పెట్టలేదో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. ఈయన ఐదు నిమిషాలకే పార్టీ మార్చే రకం అని ఎద్దేవా చేశారు. అతడిని చూస్తే జాలేస్తుందన్నారు. రాష్ట్ర విభజన పాపం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లదేనని అన్నారు.