మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ రద్దయింది. ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను గురజాల కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలుచేసేందుకు పోలీసులు పిన్నెల్లి ఇంటికి వెళ్లగా, ఆయన అప్పటికే అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంతకుముందు మార్చి 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్లలోని 29వ వార్డు పోలింగ్ స్టేషన్లోకి లక్ష్మారెడ్డి వెళ్లి అక్కడ గందరగోళం సృష్టించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఏజెంట్లపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించడమే కాక, ఈ విషయంలో అధికారులను కూడా బెదిరించారు. అదే సమయంలో అక్కడున్న ఈవీఎంను నేలకేసి పగలగొట్టారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లక్ష్మారెడ్డిని అక్కడినుంచి బయటకు పంపేశారు. ఈ సందర్భంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ కూడా జరిగింది. ఆ కేసులో ఇంతకుముందు పిన్నెల్లి లక్ష్మారెడ్డికి బెయిల్ మంజూరు కాగా, తాజాగా గురజాల కోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది.
పిన్నెల్లి లక్ష్మారెడ్డి బెయిల్ రద్దు
Published Thu, Apr 10 2014 2:36 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement